విజయవంతంగా చంద్రయాన్-3 కక్ష్య కుదింపు..జాబిల్లికి మరింత చేరువ

మరో రెండు కక్ష్య కుదింపు చర్యలు ఉంటాయన్న ఇస్రో

ISRO successfully performs orbit reduction manoeuvre, brings Chandrayaan-3 closer to moon

బెంగళూరు: చంద్రయాన్-3 తన లక్ష్యానికి మరింత చేరువైంది. ఆదివారం రాత్రి ఇస్రో శాస్త్రవేత్తలు వ్యోమనౌక‌లోని ఇంజిన్‌ను మండించి కక్ష్యను కుదించారు. దీంతో, చంద్రయాన్-3 చంద్రుడికి మరింత దగ్గరైంది. ఈ నెల 9న మధ్యాహ్నం 1.00 నుంచి 2.00 మధ్య చంద్రయాన్-3 జాబిల్లికి మరింతగా దగ్గరయ్యేలా మరో చిన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఆ తరువాత రెండు సార్లు కక్ష్య మార్పు కార్యక్రమం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. చివర్లో చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి చంద్రయాన్-3ని చేర్చుతారు. అనంతరం ఈ నెల 23న చంద్రుడిపై దించుతారు. చంద్రయాన్-3 వ్యోమనౌకను గత నెల శ్రీహరికోట నుంచి ప్రయోగించిన విషయం తెలిసిందే. తొలుత భూమి చుట్టూ పరిభ్రమిస్తూ వేగం పుంజుకున్న వ్యోమనౌక శనివారం జాబిల్లి కక్ష్యలోకి తొలిసారిగా ప్రవేశించింది.

చంద్రయాన్‌-3ని జూలై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా ఇస్రో ప్రయోగించిన విషయం తెలిసిందే. 18 రోజులపాటు భూకక్ష్యలో తిరిగిన వ్యోమనౌక ఈ నెల 1న ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్యలోకి అడుగుపెట్టింది. శనివారం చంద్రుని కక్ష్యలోకి చేరింది. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ.. చంద్రయాన్‌-3ని చంద్రమామకు 100 కిలోమీటర్ల ఎత్తులోకి ఇస్రో చేర్చనున్నది. ఈ నెల 23న చంద్రుడిపై ల్యాండర్‌ అడుగుపెట్టే అవకాశం ఉంది.