పిల్లల అభిరుచులకు అనుగుణంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే .వీ రమణాచారి కమనీయం…దీత్యా రెడ్డి కూచిపూడి నృత్య రంగ ప్రవేశం

హైదరాబాద్ : పిల్లల అభిరుచులకు అనుగుణంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే .వీ రమణాచారి అన్నారు. పాశ్చాత్య సంస్కృతి పెచ్చరిల్లుతున్న నేటి రోజుల్లో భారతీయ సంస్కృతి పట్ల మక్కువతో నేటి చిన్నారులు కూచిపూడి నృత్యాన్ని నేర్చుకునేందుకు ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. శ్రీ శారదా నృత్య నికేతన్ లో శిక్షణ పొందిన బూసం దీత్యా రెడ్డి శుక్రవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో కూచిపూడి నృత్య రంగ ప్రవేశం చేసింది. గురువు శ్రీమతి శైలజా ప్రసాద్ వద్ద ధీత్యా రెడ్డి శిక్షణ పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే .వీ రమణాచారి మాట్లాడుతూ చిన్నతనం నుంచి పిల్లల నడవడిక, అభిరుచులను తల్లిదండులు గమనిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిధులుగా కన్సల్టెంట్ సైకాలజిస్ట్ డాక్టర్ బీ.వీ పట్టాభిరామ్, డాక్టర్ పార్వతి వర్దిని, విజయవాడ ఇండ్ల హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ ఇండ్ల రామ సుబ్బారెడ్డి హాజరు కాగా దీత్యా రెడ్డి తల్లిదండ్రులు బూసం రవికాంత్ రెడ్డి , సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రభారతి వేదికపై కందచపు తాళం గంభీరనాట రాగంలో శ్రీ విజ్ఞ రాజం భజే, ఆది తాళం కురంజి రాగంలో ముద్దుగారే యశోదా, ఆది తాళం ఆరభి రాగంలో దశావతార అష్టపది , మిస్రచాపు తాళం భైరవి రాగంలో భామా కలాపం, ఆది తాళం రాగమాలిక రాగంలో మరకత మణిమయ చేల, ఆది తాళం నీలాంబరి రాగంలో శృమ్గార లహరి కృతి, అది తాళం ధనశ్రీ రాగంలో థిల్లానా , మంగళం నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి.