ఈరోజు ఏపీ ప్రజలకు చీకటి రోజు అంటున్న టీడీపీ నేతలు

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ను స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో CBI అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం నంద్యాలలో హైడ్రామా తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం విజయవాడలో 3వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో ఆయన్ను హాజరుపరచనున్నారు. కాగా చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రజలకు చీకటి రోజుగా అభివర్ణిస్తున్నారు టీడీపీ నేతలు. రాజకీయ కుట్రతో అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ.
చంద్రబాబు అరెస్ట్‌తో వైస్సార్సీపీ కి కాలం చెల్లిందని వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ చేసింది చంద్రబాబును కాదు, ప్రజాస్వామ్యాన్ని, ఒక విజన్‌ను అని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్‌లో అవినీతి జరిగిందన్నది వైసీపీ అబద్దపు ప్రచారం మాత్రమే అని తెలిపారు. ఏపీతో పాటు తెలంగాణ, గుజరాత్ సహా మొత్తం 8 రాష్ట్ర ప్రభుత్వాలతో సిమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుందన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ పనితీరు బాగుందని గతంలో వైస్సార్సీపీ ప్రభుత్వమే అభింనందన పత్రం అందజేయలేదా అని ప్రశ్నించారు. కేవలం కక్ష్యతో అక్రమ కేసులతో అరెస్టులు చేశారని, ఇందులో ఎలాంటి అక్రమాలు లేవని హైకోర్టు చెప్పిందన్నారు.