ఆర్థిక సంక్షోభంలో పాక్‌..పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ. 35పెంపు

పాక్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి బాధ్యత అల్లాదేనన్న పాక్ ఆర్థిక మంత్రి

Pakistan govt raises petrol, diesel prices by Rs 35 each

ఇస్లామాబాద్‌ః తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ డబ్బుల్లేక విలవిల్లాడుతోంది. ఈ నేపథ్యంలో ఖజానాను నింపుకునేందుకు ప్రజలపై తీవ్ర భారాన్ని మోపింది. పెట్రోలు, డీజిల్ ధరను లీటరుకు రూ. 35 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ధరల పరిమితులను ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసిన తర్వాత పాక్ కరెన్సీ దాని విలువలో దాదాపు 12 శాతం కోల్పోయింది. రూపాయి విలువ దారుణంగా క్షీణించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఆయిల్ అండ్ గ్యాస్ అధికారుల సిఫార్సుల మేరకే పెట్రోలు, డీజిల్ ధరలను పెంచినట్టు పాక్ ఆర్థికమంత్రి ఇషాక్ దార్ తెలిపారు. ధరలు పెరిగే అవకాశం ఉండడంతో కృత్రిమ కొరత, ఇంధనం నిల్వ చేసుకునే అవకాశాలు ఉన్నాయన్న అధికారుల సూచనతోనే ధరలను తక్షణం పెంచినట్టు తెలిపారు. పాక్ ఆర్థిక వ్యవస్థకు, దేశ శ్రేయస్సుకు అల్లాదే బాధ్యత అని చెప్పిన రెండు రోజుల్లోనే దార్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. పాకిస్థాన్‌ను కనుక అల్లా సృష్టిస్తే ఆయనే దానిని కాపాడుకుంటాడని, అభివృద్ధి చేస్తాడని మంత్రి దార్ రెండు రోజుల క్రితం పేర్కొన్నారు. అంతలోనే ఇప్పుడు పెట్రోలు, డీజిల్ ధరలను అమాంతం పెంచేసి సామాన్యులపై మోయలేని భారాన్ని వేశారు.