పాక్ స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఇమ్రాన్‌ఖాన్‌కు పరాభవం

షేమ్ ఆన్ పీసీబీ.. అంటూ దుమ్మెత్తి పోస్తున్న అభిమానులు

Imran Khan

ఇస్లామాబాద్‌ః పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఆ దేశానికి వన్డే ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్‌ఖాన్‌కు దారుణ పరాభవం ఎదురైంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాక్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో ఇమ్రాన్‌ను విస్మరించడం విమర్శలకు కారణమైంది. పీసీబీ విడుదల చేసిన వీడియోలో పాకిస్థాన్ గ్రేటెస్ట్ ఆటగాళ్లను ప్రస్తావించిన బోర్డు.. 1992లో దేశానికి ప్రపంచకప్‌ను అందించిపెట్టిన ఇమ్రాన్‌ను గాలికి వదిలేసింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు, క్రికెట్ ప్రేమికులు పీసీబీ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ‘షేమ్ ఆన్ పీసీబీ’ అని మండిపడుతున్నారు. పాక్ క్రికెట్ నుంచి ఇమ్రాన్‌ను తొలగించడం ఎవరికీ సాధ్యం కాదని కామెంట్లు చేస్తున్నారు. ఆయన ప్రతి క్రికెట్ లవర్ మదిలోనూ ఉంటాడని చెబుతున్నారు. పీసీబీ మాజీ చైర్మన్ ఖాలిద్ మహమూద్ కూడా తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. వీడియోను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు గళమెత్తాలని కోరారు.

https://twitter.com/TheRealPCB/status/1691091543350771712