రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ఆలోచించి ఓటు వేయాలిః సిఎం కెసిఆర్‌

CM KCR

హైదరాబాద్‌ః ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూముల ధరలు పెరిగాయని సిఎం కెసిఆర్‌ అన్నారు. నీటి సదుపాయాలు కల్పించినందునే భూముల ధరలు పెరిగాయని చెప్పారు. రైతులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో రైతుబంధు ఇస్తున్నామని పునరుద్ఘాటించారు. 2004 ఎన్నికలకు ముందు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ హమీ ఇచ్చిందని.. ఎన్నికలు అవ్వగానే ఇచ్చిన హామీని విస్మరించిందని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చుడో..కెసిఆర్‌ సచ్చుడో అన్నట్లు తాను పోరాటం చేశానని తెలిపారు. బిఆర్ఎస్ పోరాటానికి భయపడి కాంగ్రెస్‌ నేతలు ప్రత్యేక తెలంగాణ ఇచ్చారని పేర్కొన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్​నగర్​లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ ప్రసంగించారు.

“రాష్ట్రంలో తండాలకు సైతం శుద్ధమైన నీరు వస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 24 గంటల కరెంట్‌ ఇస్తున్నాం. రాష్ట్రంలో ఒక్కొక్క విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చు పెడుతున్నాం. ప్రజలంతా రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి జాగ్రత్తగా ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణితి రావాలి. ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి. ఎన్నికల్లో సేవ చేసే వ్యక్తులకు ఓటు వేయాలి. రైతులు, పేదల గురించి ఆలోచించే వారికి ఓటు వేయండి. ప్రజల వద్ద ఉన్న ఓటే వజ్రాయుధం. మనం వేసే ఓటు.. భవిష్యత్తును నిర్ణయిస్తుంది.” అని కెసిఆర్ ప్రజలకు వివరించారు.