వంట నూనె ధరలు రూ. 30 నుండి 40 తగ్గాయి

నిత్యావసర ధరలు ఆకాశానికి తాకుతున్న వేళ…వంట నూనెల ఆయిల్ సంస్థలు సామాన్య ప్రజలకు తీపి కబురు అందించారు. రూపాయి , రెండు రూపాయిలు కాదు ఏకంగా రూ. 30 నుండి 40 వరకు తగ్గించాయి. ఈ మేరకు సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్ ఇండియా(ఎస్ఈఏ) ఓ ప్రకటనలో తెలిపింది. వంట నూనెల ఉత్పత్తులపై దిగుమతి పన్ను భారాన్ని కేంద్రం ఇటీవల తగ్గించింది. రిఫైన్డ్‌ పామాయిల్‌​పై కస్టమ్స్ డ్యూటీని 17.5 శాతం​ నుంచి 12.5 శాతానికి సవరించింది. డిసెంబర్ 2022 వరకు లైసెన్స్ లేకుండానే రిఫైన్డ్‌ పామాయిల్‌ను దిగుమతి చేసుకోవడానికి వ్యాపారులకు అనుమతించింది.

ఈ తరుణంలో ఆయిల్ సంస్థలు నూనె ధరలను భారీగా తగ్గించాయి. అదానీ విల్​మార్​ (ఫార్చ్యూన్​ బ్రాండ్​), రుచి సోయ( మహాకోష్​, సన్​రిచ్​, రుచి గోల్డ్​, న్యూట్రెల్లా బ్రాండ్స్​), ఇమామి( హెల్తీ అండ్ టెస్టీ బ్రాండ్స్​), బంగే​(డాల్డా, గగన్​, ఛంబల్ బ్రాండ్స్), జెమిని(ఫ్రీడమ్ సన్​ ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్స్​), సీఓఎఫ్​సీఓ (న్యూట్రిలైవ్ బ్రాండ్‌లు), ఫ్రిగోరిఫికో అల్లానా (సన్నీ బ్రాండ్‌లు), గోకుల్ ఆగ్రో (విటాలైఫ్, మహేక్, జైకా బ్రాండ్‌లు)తో పాటు ఇతర బ్రాండ్‌లు కూడా ధరలు తగ్గించాయని ఎస్ఈఏ పేర్కొంది. ఈ ప్రకటన సామాన్యులకు ఎంతో ఊరట కలిగించే విషయం.