తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు

తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనం
జనవరి 19న తిరిగి మూసివేత

కేరళ: శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఈ తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. జనవరి 19వ తేదీ వరకు ఆలయం తెరిచే ఉంటుంది. ప్రతి రోజూ తెల్లవారుజామున 4 గంటలకు ఆలయాన్ని తెరిచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి హరివరాసనం వరకు భక్తులను అనుమతిస్తారు. అనంతరం పది గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్టు అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం (ఏబీఏఎస్ఎస్) ప్రతినిధి అరుణ్ గురుస్వామి తెలిపారు.

రెండేళ్ల తర్వాత తొలిసారి పెద్దపాదం మార్గాన్ని భక్తుల కోసం తెరిచారు. రేపటి నుంచి ఈ మార్గంలో భక్తులను అనుమతిస్తారు. ఎరుమేలి నుంచి ఉదయం ఐదున్నర గంటల నుంచి రాత్రి పదిన్నర మధ్య ఈ మార్గంలో భక్తులను అనుమతిస్తారు. నీలక్కల్, ఎరుమేలి వద్ద దర్శనం కోసం స్పాట్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. భక్తులు తప్పనిసరిగా రెండు డోసులు వేసుకున్నట్టుగా టీకా ధ్రువీకరణ పత్రాన్ని కానీ, కరోనా నెగటివ్‌గా ధ్రువీకరించే ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టును కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. 19న ఆలయాన్ని మూసివేస్తారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/