ప్రధాని మోడీ సంచలన నిర్ణయం : 3 నూతన వ్యవసాయ చట్టాలు రద్దు

Barmer accident: PM Modi announces 2 lakh ex-gratia for kin of victims

ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాము కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తాము తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని, కానీ.. ఒక వర్గం రైతులను ఒప్పించలేకపోయినట్లు తెలిపారు మోదీ. ”3 వ్యవసాయ చట్టాల లక్ష్యం.. సన్నకారు రైతుల్లో సాధికారత తీసుకురావడం. ఇవి రైతులకు ప్రయోజనం చేకూర్చేవే. కానీ.. ఒక వర్గం రైతులను మేం ఒప్పించలేకపోయాం. ఐదు దశాబ్దాల నా ప్రజా జీవితంలో రైతుల కష్టాలను, సవాళ్లను తెలుసుకున్నా.” అని అన్నారు.

ఈ సందర్భాంగా దేశ రైతులందరికీ క్షేమపణలు తెలిపారు. గురునానక్​ జయంతి సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ ప్రకటన చేసారు. పార్లమెంటు సమావేశాల్లో సాగు చట్టాల రద్దుపై ప్రకటన చేస్తామని పేర్కొన్నారు మోదీ. దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతులు ఇక ఆందోళన విరమించి ఇళ్లకు వెళ్లాలని కోరారు. సిక్కులకు అత్యంత పవిత్రమైన రోజున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు మోదీ పేర్కొన్నారు. అయితే, కొత్త సాగు చట్టాల వల్ల చిన్న రైతులకు మేలు జరుగుతుందని మోదీ అంతకు ముందు వ్యాఖ్యానించారు. రైతులకు మేలు జరిగేలా ఈ చట్టాలను తీసుకొచ్చినా.. అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యారని తెలిపారు.

అన్నదాతల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వ్యవసాయానికి బడ్జెట్‌లో కేటాయింపులు ఐదు రెట్లు పెంచామని తెలిపారు. రైతులకు తక్కువ ధరకే విత్తనాలు లభించేలా కృషిచేశామని పేర్కొన్నారు. 22 కోట్ల భూసార కార్డులను పంపిణికి చర్యలు చేపట్టామని, ఫసల్ బీమా యోజనను మరింత బలోపేతం చేస్తామని వివరించారు.