ఒడిశా రైలు ప్రమాద మృతదేహాలను ఉంచిన స్కూల్‌ కూల్చివేత

odisha-school-where-crash-victims-bodies-were-kept-demolished

బాలాసోర్: ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో 288 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వీరి మృత దేహాలను ఉంచిన స్థానిక పాఠాలను కూల్చివేస్తున్నట్లు బాలాసోర్ జిల్లా కలెక్టర్ దత్తాత్రయ భౌసాహెబ్ షిండే మీడియాకు తెలిపారు. రైలు ప్రమాదం జరిగిన తర్వాత సమీపంలో ఉన్న బాహాగానా ప్రభుత్వ పాఠశాలలో జిల్లా యంత్రాంగం క్యాంపు ఏర్పాటు చేసింది. ప్రమాదంలో మృతి చెందిన వారి బాడీలను అక్కడికి తరలించారు. ఈ క్రమంలో పాఠశాలలోని ప్రేయర్‌ రూంతోపాటు, కొన్ని తరగతి గదుల్లో మృతదేహాలను ఉంచారు. అనంతరం ఆ మృతదేహాలను మార్చురీకి తరలించారు.

ఐతే ఇది జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే మృతదేహాలు ఉంచిన పాఠశాలకు రావడానికి విద్యార్ధులు బయపడుతున్నట్లు వారి తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చనిపోయిన వారి మృతదేహాలను ఉంచిన హైస్కూలును కూల్చివేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు అయన తెలిపారు. ఐతే స్కూలు మేనేజింగ్ కమిటీ ఆమోదిస్తే.. శవాలను ఉంచిన గదులను కూల్చివేసి కొత్తవి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై పాఠశాల కమిటీ వెంటనే సమావేశమై కూల్చివేతకు ఆమోదం తెల్పడంతో శుక్రవారం కూల్చివేత పనులు ప్రారంభించినట్లు కలెక్టర్‌ తెలిపారు. కొత్త భవనాలు నిర్మించిన తర్వాత పూజాది కార్యక్రమాలు నిర్వహించి స్కూల్‌ పునఃప్రారంభిస్తామని ఆయన అన్నారు. మరోవైపు ఒరిస్సా రాష్ట్ర వ్యాప్తంగా వేసవి సెలవులు జూన్‌ 19వ తేదీతో ముగియనున్నాయి.