తెలంగాణ లో బిజెపి షాక్ : కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎర్ర శేఖర్

తెలంగాణ లో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని చెపుతున్న బిజెపి కి బిగ్ షాక్ తగిలింది. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మహబూబ్‌నగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎర్ర శేఖర్..గురువారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గాంధీ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గీతారెడ్డి, మధుయాష్కి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అయితే, ఎర్ర శేఖర్ చేరికను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకిస్తూ.. ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

నేర చరిత్ర ఉన్న వాళ్లను పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. గాంధీ సిద్దాంతాలు నమ్మే కాంగ్రెస్‌లోకి నేరగాళ్లు వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఎర్ర శేఖర్ కాంగ్రెస్‌లో చేరతారనే వార్తలు వచ్చినప్పుడు ఆయన అధిష్టానానికి లేఖ రాశారు. ఆయణ్ని పార్టీలో చేర్చుకోవద్దని కోరారు. మరోవైపు.. ఎర్ర శేఖర్ చేరికను గీతారెడ్డి సమర్థించారు. ఇక సోదరుడి హత్య కేసులో ఎర్ర శేఖర్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే, ఈ కేసును కోర్టు ఇప్పటికే కొట్టివేసింది.