శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్‌ ఎన్వీ రమణ..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఈరోజు శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాతం, అభిషేక సేవలో వారు పాల్గొన్నారు.

సీజేఐతోపాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ కూడా శ్రీనివాసుని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌కు ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి శేశ వస్త్రాన్ని బహూకరించి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ప్రస్తుతం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. రేపు విజయవాడలో కోర్టుల ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన జీ+7 అంతస్థుల కోర్టు కాంప్లెక్స్ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రోటోకాల్ ప్రకారమే సీజేఐ ఎన్వీ రమణతో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు.

2013 లో ఎన్వీ రమణ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన సమయంలో ఈ నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎట్టకేలకు ఆ భవనాలకు మళ్లీ ఎన్వీ రమణ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం కూడా జరుగుతోంది. 20న నూతన భవనాలు ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు ఆత్మీయ సన్మానం జరగనుంది. ఈ సన్మాన కార్యక్రమం అనంతరం మంగళగిరిలోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో సీజేఐ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకే వేదికపైకి వస్తున్న సందర్భం కావడంతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.