సొంత పార్టీ నేతలపై మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఫైర్

వైస్సార్సీపీ మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. సొంత నియోజకవర్గంలో తనను బలహీన పరిచేందుకు సొంత పార్టీ నాయకులే కుట్ర చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరులోని 52వ డివిజన్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనను బలహీనపరిచేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని, టీడీపీ నాయకులు కొందరు డబ్బులిచ్చి తనపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

డబ్బులిచ్చి తనను తిట్టించే స్థాయికి దిగజారారని మండిపడిన అనిల్ కుమార్.. వైస్సార్సీపీ లో ఉండి ఓ నేత ఈ సిగ్గుమాలిన పని చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యేలు, నాయకులతో టచ్‌లో ఉంటూ టీడీపీ నాయకుల్లో ఒకరు రోజుకు రూ. 10 వేలు, మరికొందరు లక్ష రూపాయల చొప్పున సంపాదిస్తున్నారని అన్నారు. వారి చరిత్ర మొత్తం తన దగ్గర ఉందని, సమయం రాగానే బయటపెడతానని అనిల్ అన్నారు.