ఇజ్రాయెల్‌-హ‌మాస్ వార్‌.. కేంద్ర ప్ర‌భుత్వం వైఖ‌రి పై కేసీ వేణుగోపాల్ అసంతృప్తి

KC Venugopal is unhappy with the central government attitude towards the Israel-Hamas war

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్‌-పాల‌స్తీనా యుద్ధంపై ప్ర‌భుత్వ తీరు ప‌ట్ల ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. గాజా ఆస్ప‌త్రిపై దాడిలో పెద్ద‌సంఖ్య‌లో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోవ‌డం ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన మ‌రుస‌టి రోజు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇజ్రాయెల్‌-హ‌మాస్ వార్‌పై కేంద్ర ప్ర‌భుత్వం వైఖ‌రి స‌రైంది కాద‌ని, ఇది తీవ్రంగా నిరుత్సాహ‌ప‌రిచేలా ఉంద‌ని వ్యాఖ్యానించారు.

ప్ర‌తిదాడుల్లో మ‌హిళ‌లు, చిన్నారులు చిక్కుకుని నిస్తేజంగా మారితే దీనికి వ్య‌తిరేకంగా భార‌త్ తీవ్ర వైఖ‌రి తీసుకోకుండా ఉండ‌టం స‌రైంది కాద‌ని అన్నారు. ఇజ్రాయెల్‌-పాల‌స్తీనా వ్య‌వ‌హ‌రంలో భార‌త ప్ర‌భుత్వ వైఖ‌రి నిరుత్సాహ‌ప‌రిచేలా ఉంద‌ని ఆక్షేపించారు. ఈ అంశంపై భార‌త్ వైఖ‌రి తొలి నుంచీ భిన్నంగానే ఉంద‌ని అన్నారు.

ఇజ్రాయెల్‌-హ‌మాస్ యుద్ధంలో పౌరుల మ‌ర‌ణాలు ఆందోళ‌న రేకెత్తిస్తున్నాయ‌ని, దీనికి పాల్ప‌డిన వారిని బాధ్యుల‌ను చేయాల‌ని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. కాగా, భార‌త్ పాల‌స్తీనా వాదానికి మ‌ద్ద‌తిస్తుంద‌ని, వారి హ‌క్కుల కోసం వారి ప‌క్షాన నిలిచింద‌ని వేణుగోపాల్ గుర్తుచేశారు. భార‌త్ వైఖ‌రి ప్ర‌స్తుత యుద్ధానికి తెర‌దించే స్ధాయిలో లేద‌ని అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఇజ్రాయెల్‌-పాల‌స్తీనా వ్య‌వ‌హారంపై గ‌తంలో మాదిరి భార‌త్ హుందాగా వ్య‌వ‌హ‌రించాల‌ని అన్నారు. ఇజ్రాయెల్‌, పాల‌స్తీనా విధిగా అంత‌ర్జాతీయ మాన‌వ‌తా చ‌ట్టాల‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.