చంద్రబాబుపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఆగ్రహం

శుక్రవారం అసెంబ్లీ లో చంద్రబాబు , ఆయన భార్య నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల ఫై నందమూరి ఫ్యామిలీ భగ్గుమంది. ఇప్పటికే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేయగా..తాజాగా జూ. ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ , రామకృష్ణ , నారా రోహిత్ లు మండిపడ్డారు.

‘నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటన.. నా మనసును కలిచివేసింది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజా సమస్యలపై జరగాలి. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. ఆడపడుచులపై పరుష వ్యాఖ్యలు.. అరాచక పాలనకు నాంది. ఆడవాళ్లను గౌరవించడం మన సంస్కృతి. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు జాగ్రత్తగా అప్పగించాలి’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ.. ‘‘అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటు పడే దేవాలయం వంటిది. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్న వారు ఉంటారు. అలాంటి ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి, అదీ వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది బాధాకరం. ఇది సరైన విధానం కాదు. సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో అకారణంగా దూషించే పరిస్థితి ఎదురుకావటం దురదృష్టకరం. అందరూ హుందాగా నడుచుకోవాలని మనవి చేసుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.

‘ఉన్నత విలువలతో ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అసెంబ్లీలో నిన్న కొందరు సభ్యులు పశువుల కంటే హీనంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అసభ్యపదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేయడం దిగ్భ్రాంతికరం. రాజకీయ విమర్శలు.. విధానాలపై ఉండాలి కానీ కుటుంబసభ్యులను అందులోకి లాగి అసభ్యంగా మాట్లాడటం క్షమార్హం కాదు. రాజ్యాంగం ప్రసాదించిన వాక్‌ స్వాతంత్య్ర హక్కును దుర్వినియోగం చేసి నోటికొచ్చినట్టు మాట్లాడం తగదు. వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి చంద్రబాబు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే అది మీ భ్రమే అవుతుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండటం వల్లే మీ మనుగడ సాగింది. ఇప్పటికీ వాటికి కట్టుబడి ఉండటం వల్లే సంయమనంతో ఉన్నాం. శిశుపాలుడి వంద తప్పులు పూర్తయినట్టు నిన్నటితో మీ వంద తప్పులు పూర్తయ్యాయి. ఇక, మీ అరాచకాన్ని ఉపేక్షించేది లేదు. ప్రతి ఒక్క తెలుగుదేశం సైనికుడు వైసీపీ దుశ్శాసనుల భరతం పడతారు. ఈ వికృత క్రీడలను వెనుక ఉండి ఆడిస్తోన్న వారు కూడా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటి స్థాయిలేని వ్యక్తుల మధ్యలో మీరు రాజకీయం చేయాల్సి రావడం దురదృష్టకరం పెదనాన్న. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటాం’’ అని నారారోహిత్‌ అన్నారు.

రాజకీయ పరిణామాలు చూస్తే బాధేస్తోంది. ద్వారంపూడి, కొడాలి నాని, వంశీ, అంబటి రాంబాబు హద్దులు మీరారు. రాజకీయంగా ఉంటే… రాజకీయంగానే చూసుకోవాలి. వ్యక్తిగత విషయాల జోలికి రావద్దు. మేం కూడా గాజులు తొడుక్కుని కూర్చోలేదు. మా నాన్నగారు, తెదేపా క్రమశిక్షణ నేర్పింది. మా సహనాన్ని పరీక్షించొద్దు. మీరు హద్దు మీరారు.. మేమూ హద్దు మీరుతాం. – నందమూరి రామకృష్ణ

pic.twitter.com/Bgi242R0za— Jr NTR (@tarak9999) November 20, 2021