స్త్రీ జాతిని గౌరవించడం మన సంప్రదాయం: జూనియర్ ఎన్టీఆర్

ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేద్దాం: జూనియర్ ఎన్టీఆర్

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో నిన్న జరిగిన సంఘటన తన హృదయాన్ని కలచివేసిందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని… అయితే అవి వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారకూడదని చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో ద్వారా స్పందించారు. ఆయన ఏమన్నారంటే…

“అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణం. ఆ విమర్శలు, ప్రతివిమర్శలు ప్రజా సమస్యలపై జరగాలే కానీ… వ్యక్తిగత దూషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. నిన్న అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటన నా మనస్సును కలచివేసింది. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో.. ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో… అదొక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది.

స్త్రీ జాతిని గౌరవించడమనేది మన సంస్కృతి. మన నవనాడుల్లో, మన రక్తంలో ఇమిడిపోయిన ఒక సంప్రదాయం. మన సంప్రదాయాలను జాగ్రత్తగా, భద్రంగా రాబోయే తరాలకు అప్పజెప్పాలే కానీ… మన సంస్కృతిని కాల్చివేస్తూ రాబోయే తరానికి బంగారు బాట వేస్తున్నామంటే… అది మనం చేసే చాలా పెద్ద తప్పు. వ్యక్తిగత దూషణకు గురైన ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా నేను మాట్లాడటం లేదు. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశానికి చెందిన పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నా.

రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం… దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేద్దాం. ప్రజాసమస్యలపై పోరాడండి. రాబోయే తరాలకు బంగారు బాట వేసేలా, మన నడవడిక ఉండేలా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటున్నా” అని జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ నేతలకు విన్నవించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/