పదో తరగతి పేపర్‌ లీకేజీ కేసులో ఈటల రాజేందర్‌కు నోటీసులు..?

పదో తరగతి పేపర్ లీక్ ఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కీలకంగా మారింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఈ లీక్ వ్యవహారంలో సూత్రధారిగా తెలుస్తూ ఆయన్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన్ను కరీంనగర్ జైలుకు తరలించారు. ఇదే కేసులో పోలీసులు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తుంది. కమలాపూర్‌లో పేపర్‌ లీక్‌పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్టేట్‌మెంట్ ను వరంగల్ పోలీసులు రికార్డు చేయనున్నారు. ఎమ్మెల్యే ఈటలకు ప్రశాంత్ పేపర్‌ పంపడంతో ఈ విషయంలో పోలీసులు మరింత ఫోకస్ పెంచారు. పేపర్‌ లీక్‌కు హుజూరాబాద్‌ నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు? అసలేం జరిగింది..? దీని వెనుక ఎవరున్నారు..? కోణాల్లో పోలీసులు ఆరా తీయనున్నారు.

ఇటు బండి బెయిల్ పిటిషన్‌.. అటు పోలీసుల కస్టడీ పిటిషన్‌లపై న్యాయస్థానాలిచ్చే ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బండి సంజయ్‌ రిమాండ్‌ని కొట్టివేయాలంటూ హైకోర్ట్‌లో బీజేపీ లీగల్ సెల్‌ లంచ్ మోషన్ పిటిషన్‌ వేయగా.. మరోవైపు సంజయ్‌ని కస్టడీ కోరుతూ వరంగల్ పోలీసుల పిటిషన్ వేశారు. బండి సంజయ్‌ మొబైల్‌ ఫోన్ ఇవ్వలేదని.. ఫోన్ డేటాతో పాటు లీకేజ్‌ కేసులో లోతుగా విచారించాలని.. కస్టడీ పిటిషన్‌లో వేర్వేరు అంశాల్ని పోలీసులు ప్రస్తావించారు.

ఇదిలా ఉంటె రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ ఫై నిరసన సెగలు మొదలయ్యాయి. ప్రశ్న పత్రాలను లీక్‌ చేసి విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని బీఆర్‌ఎస్‌తోపాటు వివిధ ప్రజాసంఘాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బండి దిష్టిబొమ్మలను దహనం చేశారు. పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న బండికి వారి ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. మరోపక్క విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎంపీ బండి సంజయ్‌కుమార్‌పై అనర్హత వేటు వేయాలని టీఎస్‌ ఫుడ్స్‌ చైర్మన్‌ మేడె రాజీవ్‌సాగర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన లోక్‌సభ స్పీకర్‌, పార్లమెంట్‌ సెక్రటరీకి లేఖలు రాశారు.