BRS పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్బంగా నేతల ట్వీట్స్ ..

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీ 23వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా BRS నేతలు సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్స్ చేస్తున్నారు.

రెండు దశాబ్దాల క్రితం ఉద్యమపార్టీకి పురుడు పోసి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునఃప్రతిష్టించి, అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన నేత మన కేసీఆర్ అని కొనియాడారు.22 ఏండ్ల ప్రస్థానంలో నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని కేటీఆర్ ట్వీట్‌ చేశారు.

తెలంగాణ తల్లి విముక్తి కోసం ఆవిర్భవించిన బీఆర్‌ఎస్‌.. నేడు భరతమాత బంగారు భవిత కోసం పోరాడుతున్నదని ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ చేశారు. ‘కేసీఆర్ గారి నాయకత్వంలో పిడికెడు మందితో ప్రారంభమై, ప్రత్యేక రాష్ట్రం సాధించి, తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపి.. నేడు దేశ ప్రగతి కోసం, రైతు రాజ్యం కోసం వడివడిగా అడుగులు వేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ తల్లి విముక్తి కోసం ఆనాడు.. భరతమాత బంగారు భవిత కోసం ఈనాడు.. జై కేసీఆర్.. జై తెలంగాణ.. జై భారత్’ అంటూ కవిత తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

మరోపక్క (బీఆర్‌ఎస్‌) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం తెలంగాణభవన్‌లో పార్టీ ప్రతినిధులతో సమావేశం జరుగనున్నది. మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఇలా మొత్తం 279 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిన తరువాత జరగుతున్న మొదటి ప్రతినిధుల సభ కావటంతో నేటి సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ నేపథ్యంలో కీలక రాజకీయ తీర్మానాలు, పార్టీ పరిపాలనా తీర్మానాలు ఉండే అవకాశాలున్నాయి. దళితబంధు పథకం, రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహావిష్కరణ నేపథ్యంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపే తీర్మానం ఉండొచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.