గాజాను తిరిగి ఆక్రమించడం ఇజ్రాయెల్‌కు మంచిది కాదుః అమెరికా హెచ్చరిక

“Not Good For Israeli People”: US Warns Israel Against Reoccupying Gaza

వాషింగ్టన్‌ః గాజా ఆక్రమణపై ఇజ్రాయెల్‌కు అమెరికా వార్నింగ్‌ ఇచ్చింది. యుద్ధం ముగిసిన తర్వాత గాజాల్‌ నిరవధిక కాలం వరకు భద్రతను పర్యవేక్షించినట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలపై అగ్రరాజ్యం హెచ్చరికలు జారీ చేసింది. వైట్‌ హౌస్‌ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌ దళాలు గాజాను తిరిగి ఆక్రమించడం మంచిది కాదని అమెరికా అధ్యక్షుడు నమ్ముతున్నారని.. ఇది ఇజ్రాయెల్‌ ప్రజలకు మంచిది సైతం మంచిది కాదన్నారు. అధ్యక్షుడు ఆదివారం నెతన్యాహుతో మాట్లాడారని.. మానవతా సహాయాన్ని వేగవంతం చేయాలని సూచించారని కిర్బీ పేర్కొన్నారు.

వైట్‌ హౌస్‌ అక్టోబర్‌ 7 నుంచి జరిగిన ఘర్షణలో మరణించిన అనేక మంది పాలస్తీనియన్లు, ఆపరేషన్‌ నిర్వహణలో గాయపడ్డ వారి గురించి ఆలోచిస్తోందని, ప్రార్థిస్తోందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. నెల రోజులుగా ఇజ్రాయెల్‌, గాజాలో యుద్ధ మంటలు ఆగడం లేదు. గత నెల 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఆకస్మిక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ప్రతీకారంగా నెలరోజులుగా గాజాపై ఇజ్రాయెల్‌ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇప్పటికే పదివేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాడులతో దాదాపు 23లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆహారం, తాగునీరు, ఆవాసం, ఔషధాల కోసం ప్రజలు అలమటిస్తున్నారు.