సొంత రైలులో రష్యా చేరుకున్న కిమ్..పుతిన్‌తో నేడు కీలక భేటీ..?

681 కిలోమీటర్లు ట్రైన్ లోనే ప్రయాణం..ఎక్కడివక్కడే ఆగిన మిగతా రైళ్లు !

north-korea-president-kim-jong-un-on-train-specialities

ప్యాంగ్యాంగ్‌: రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయ్యేందుకు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోమవారం రష్యాకు చేరుకున్నారు. నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్ యాంగ్ నుంచి 681 కిలోమీటర్ల దూరంలోని రష్యా నగరం వ్లాదివోస్తోక్ చేరేందుకు కిమ్ తన సొంత రైలులో ప్రయాణించారు. రెండు తరాలుగా రాజ కుటుంబంలో భాగమైన రైలును ఆయన ఈ ప్రయాణానికి ఉపయోగించుకున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తో కిమ్‌ నేడు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఆయుధ అంశాలపై చర్చల కోసమే ఆయన రష్యాకు వచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే, పుతిన్‌తో కిమ్‌ భేటీ ఎప్పుడు, ఎక్కడ అన్నది మాత్రం తెలియరాలేదు.

మరోవైపు తన పూర్వీకులకు గౌరవసూచకంగానే ఆయన ఈ రైలును ఉపయోగించారని నార్త్ కొరియా పేర్కొంది. ఈ బుల్లెట్ ప్రూఫ్ రైలు వస్తుంటే మిగతా రైళ్లన్నీ ఎక్కడివక్కడే ఆగిపోవాల్సిందే. కిమ్ ప్రయాణించే మార్గంలోని స్టేషన్లకు సైనికులు ముందే చేరుకుని భద్రతా ఏర్పాట్లు చేస్తారు. అందులో భాగంగా స్టేషన్లలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. దీంతో రైళ్లన్నీ ఎక్కడివక్కడే ఆగిపోతాయి.

కాగా, కిమ్ జోంగ్ ఉన్ తాత, నార్త్ కొరియా మాజీ ప్రెసిడెంట్ కిమ్ 2 సంగ్ కు విమాన ప్రయాణాలంటే భయం.. అందుకే దూర ప్రయాణాల కోసం ప్రత్యేకంగా ఈ రైలును డిజైన్ చేయించుకున్నారు. పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ కోచ్ లు, ప్రత్యేకంగా కిచెన్ తో అత్యాధునికంగా తీర్చిదిద్దారు. కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ కు కూడా విమాన ప్రయాణాలంటే భయంతో ఈ రైలునే ఉపయోగించారు. విమాన ప్రయాణాలంటే భయమేమీ లేనప్పటికీ తన పూర్వీకుల గౌరవార్థం కిమ్ జోంగ్ ఉన్ తరచూ ఈ రైలును ఉపయోగిస్తుంటారు.

కిమ్ రైలు ప్రత్యేకతలు..

భద్రత కోసం చేసిన ఏర్పాట్ల వల్ల ఈ స్పెషల్ ట్రైన్ వేగం చాలా తక్కువ. గరిష్ఠంగా గంటకు 59 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే సామర్థ్యం మాత్రమే ఉంది.
రష్యన్, చైనీస్, కొరియన్, జపనీస్, ఫ్రెంచ్ వంటకాలను అప్పటికప్పుడు వండి వడ్డించేందుకు వీలుగా కిచెన్ లో ఏర్పాట్లు చేశారు.
కిమ్ తో పాటు ఆయన ప్రయాణించే కార్లను కూడా ఈ రైలు మోసుకెళుతుంది.
రైలులో మొత్తం 91 కోచ్ లు ఉన్నాయి. లోపల అధ్యక్షుడి కోసం విలాసవంతమైన ఏర్పాట్లు, పొడవైన టేబుళ్లు, ఫ్లాట్ స్క్రీన్ మానిటర్లను అమర్చారు.
ట్రాక్ లను పరీక్షిస్తూ ఓ ట్రైన్ ముందు వెళుతుంటే.. భద్రతా సిబ్బందిని మోసుకుంటూ మరో ట్రైన్ కిమ్ రైలు వెనక వస్తుంటుంది.
ప్రయాణానికి ముందు సుమారు వంద మంది సెక్యూరిటీ సిబ్బందిని ఆ రూట్ లోని స్టేషన్లకు పంపిస్తారు. ఆయా స్టేషన్లలో భద్రతా ఏర్పాటు చేయడమే వీరి పని. అధ్యక్షుడి స్పెషల్ ట్రైన్ వెళ్లేంత వరకూ మిగతా రైళ్లను ఆపేసేందుకు స్టేషన్ లో విద్యుత్ సరఫరా ఆపేస్తారు.