గర్భిణి మహిళలపై అమెరికాలో ఆంక్షలు

trump-pregnant women
trump-pregnant women

వాషింగ్టన్‌: ప్రసవం కోసం వచ్చే గర్భిణులపై అమెరికా వీసా ఆంక్షలను అమలు చేయనుంది. విదేశీయుల అమెరికా ప్రవేశానికి వివిధ రకాలుగా దారులు మూస్తున్న ట్రంప్ అధికార యంత్రాంగం ఇప్పుడు ఈ దిశలో యోచిస్తోంది. ఇకపై గర్భిణులు తమ టూరిస్ట్ వీసాలతో అమెరికాకు వెళ్లడానికి వీలుండదు. దేశంలో బర్త్ టూరి జం అదుపులో పెట్టాలని ట్రంప్ సంకల్పించారు. ఇందులో భాగంగా కాన్పుల కోసం అమెరికాకు వచ్చే వారిని వైద్య చికిత్సలకు అమెరికాకు వచ్చే వారిగానే పరిగణించనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ వారు ఇమ్మిగ్రేషన్ విభాగానికి మార్గదర్శకాలు వెలువరించింది. బర్త్ టూరిజం అదుపునకు రూపొందించే నిబంధనలను భారీ స్థాయిలో ప్రచారం చేయాలని అమెరికా ప్రభుత్వం తలపెట్టింది. శుక్రవారం నుంచే కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని స్పష్టం అయింది.

పలు దేశాల నుంచి నెలలు నిండిన సమయంలో అత్యధిక సంఖ్యలో మహిళలు అమెరికాకు వెళ్లి, అక్కడ పిల్లలకు జన్మనిస్తున్నారు. అత్యంత ఆదరణ, విలువ ఉన్న అమెరికా పాస్‌పోర్టు తమ పిల్లలకు దక్కుతుందనే ఆలోచనతో ఈ విధంగా చేస్తున్నారని , దీనిని అరికట్టాల్సి ఉందని అమెరికా వీసా నిర్వహణల సంస్థ భావిస్తోంది. అయితే వేరే దేశాల నుంచి ప్రసవం కోసం అమెరికాకు రావడం ఇప్పటికైతే చట్టబద్ధమే. ఇతర దేశాల వారు అమెరికాకు వచ్చి పిల్లలను కనడం, ఈ పిల్లలు అమెరికా పౌరసత్వాన్ని స్వతహసిద్ధంగా పొందే హక్కుపై ట్రంప్ మండిపడుతున్నారు. జన్మస్థల హక్కుతో పౌరసత్వం దక్కించునే రాజ్యాంగ నిబంధనను తాను రద్దు చేస్తానని పలు సందర్భాలలో ట్రంప్ చెపుతూ వచ్చారు. అయితే ఇది అనుకున్నంత సులువు కాదని విజ్ఞులు, చివరికి ట్రంప్ అధికార యంత్రాంగంలోని వారే స్పష్టం చేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/