నాలుగేళ్ల ముందే అవిశ్వాస తీర్మానాన్ని ఊహించిన మోడీ

2019లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మోడీ వ్యాఖ్యలు

No-confidence motion: Modi’s ‘prediction’ from 2019 goes viral

న్యూఢిల్లీః మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో హీట్ పెరిగింది. అల్లర్లను అణచివేయడంలో ప్రభుత్వం విఫలమైందని, మణిపూర్ లో హింసకు కేంద్రానిదే బాధ్యతని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్, బిఆర్ఎస్ సిద్ధమయ్యాయి. ఈమేరకు ఆ పార్టీలు నోటీసులు ఇవ్వగా.. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు లోక్ సభ స్పీకర్ ఆమోదం తెలిపారు.

అయితే, ఈ సంఘటనను ప్రధాని నరేంద్ర మోడీ నాలుగేళ్ల క్రితమే ఊహించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మోడీ మాట్లాడిన పాత వీడియో ఒకటి వైరల్ గా మారింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్లమెంట్ లో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2019 ఫిబ్రవరిలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. 2023లోనూ తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ప్రతిపక్ష సభ్యులకు రావాలని కోరుకుంటున్నట్లు మోడీ చెప్పారు. అందుకోసం ప్రతిపక్షాలు సిద్ధం కావాలని ఆయన సూచించారు. 2019 జనరల్ ఎలక్షన్స్ లోనూ ప్రతిపక్షాలకు ఓటమి తప్పదని, వచ్చే ఐదేళ్లు కూడా ప్రతిపక్షంగానే కొనసాగుతారని పరోక్షంగా చెప్పారు. ఈ వీడియో క్లిప్పింగ్ ను దూరదర్శన్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.