సోనియా గాంధీతో మాట్లాడేందుకు నితీష్ కుమార్ నిరాకరణ..!

nitish-kumar-refused-to-talk-to-sonia-gandhi

న్యూఢిల్లీః పార్లమెంట్ ఎన్నికల ముందు బిహార్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు రావడంతో సీఎం నీతీశ్ కుమార్ బిజెపితో మళ్లీ జట్టుకట్టాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఎన్డీఏతో చేతులు కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఆదివారం రోజున బిహార్లో కొత్త సర్కార్ ఏర్పాటవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ‘ఇండియా’ కూటమికి గట్టి కోల్కోని దెబ్బ కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఊహాగానాల వేళ పరిస్థితులు చక్కదిద్దేందుకు కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే ఆమె నీతీశ్‌కు ఫోన్‌ చేసినట్లు సమాచారం. అయితే సోనియాతో మాట్లాడేందుకు సీఎం విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే నీతీశ్ కుమార్ మళ్లీ బిజెపి జట్టుతో కొత్త సర్కార్ ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఈ నెల 30న బిహార్‌లో ప్రవేశించనున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనాలని ఇప్పటికే హస్తం పార్టీ నీతీశ్‌ను ఆహ్వానించింది. దీని గురించి సోనియా గాంధీ శుక్రవారం ఆయనతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ, ఆ కాల్స్‌ను సీఎం పట్టించుకోలేదని తెలుస్తోంది.