మణిపూర్ హింసాకాండ..రాత్రంతా పార్లమెంట్ ఆవరణలో విపక్ష నిరసన దీక్ష

Opposition MPs Sit On Night Protest Outside Parliament Amid Manipur Tangle

న్యూఢిల్లీః మణిపూర్ హింసాకాండ పార్లమెంటును కుదిపేస్తోంది. ఆందోళనలు, అల్లర్లు, హింసాకాండ ఘటనలతో మణిపూర్ అట్టుడుకుతుంటే ప్రధాని మోడీ కనీసం మాట్లాడటం లేదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై మోడీ తక్షణమే సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతల నినాదాలు, ఆందోళనలు, నిరసనలతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడు రోజులుగా స్తంభిస్తున్నాయి. మణిపూర్ మంటలతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది.

వర్షాకాల సమావేశాలు వరుసగా మూడో రోజైన సోమవారం పార్లమెంట్ లో మణిపూర్ అంశంపై ప్రతిష్టంభన కొనసాగింది. ఉభయ సభలు ప్రతిపక్షాల ఆందోళనలతో అట్టుడికాయి. ప్రతిపక్ష నాయకుల నినాదాలతో సభలు హోరెత్తాయి. మణిపూర్ అంశంపై ప్రధాని సమాధానం చెప్పాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో విపక్ష ఎంపీలు సోమవారం రాత్రి పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన కొనసాగించారు.

మణిపూర్ లో జరుగుతున్న హింసాకాండపై ప్రధాని మోడీ సమగ్ర ప్రకటన చేయాలంటూ ప్రతిపక్ష కూటమి అయిన ‘ఇండియా’ పార్లమెంట్ ఆవరణలో రాత్రంతా ఆందోళన చేపట్టింది. ‘మణిపూర్ కోసం భారత్’, ‘భారత్ డిమాండ్ మణిపూర్’ ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శిస్తూ నిరసన కొనసాగించారు. ఆప్, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.