నీతికి మారుపేరు నితీష్‌కుమార్!
‘వార్తల్లోని వ్యక్తి’- ప్రతి సోమవారం

నేటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు ముఖ్య మంత్రి పదవి ఇప్పటిది ఏడవసారి!
అంతేకాదు 2000లో ఆయన ఒకసారి ఏడురోజులే ముఖ్యమంత్రి! మొన్న జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఆయనకు సీట్లు తక్కువ రావడం వల్ల ఈసారి ఆయన ముఖ్యమంత్రి కాడనుకున్నారు.
అయితే, అదృష్ట జాతకుడు! ఎక్కువ సీట్లు వచ్చిన బిజెపి కూడా ఆయనే తమ ముఖ్యమంత్రి అన్నది! ఇంకేమీ? నితీష్ పంట పండింది.!
ఆయనకు మరోసారి ముఖ్యమంత్రిత్వం లభించింది.! నిజానికి, నీతికి మారుపేరు నితీష్ కుమార్ అని చెప్పవచ్చు. ఆయన లోగడ కేంద్రంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు.
ఏదో విషయంలో ప్రధానితో పేచీ వచ్చి, ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. లాల్‌బహుదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా ఉంటూ ఒక చోట రైలు ప్రమాదం జరిగే సరికి ప్రధాని నెహ్రూ వారించినా వినకుండా ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
ఆ తరువాత నితీష్ ప్రధాని ఒత్తిడిపై తిరిగి మంత్రి అయినారు. అయితే బీహార్ మంత్రి కావాలన్నది ఆయన చిరవాంఛితం.
అందు వల్ల బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తరువాత లాలూప్రసాద్ పార్టీ పెద్దదిగా వచ్చినప్పటికీ రాష్ట్రంలో మైనారిటీలో ఉన్న ఎన్.డి.ఏ తరపున నితీష్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి అయి కూర్చున్నారు!
తీరా తన ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస ప్రకటనను ఎదుర్కొన వలసి వచ్చేసరికి తనకు మెజారిటీ లేదు కాబట్టి, ముందుగానే నితీష్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తిరిగి కేంద్రానికి పయనం! ఇదీ నితీష్ రాజీనామాల ప్రహసనం!
అప్పటిల్లో తన సమతాపార్టీని జనతాదళ్(యు)లో విలీనం చేయాలని ఆయన ప్రయత్నం.అసలే బలం లేని జనతాదళ్‌లో బలీయమైన సమతా పార్టీ విలీనం కావడం యిష్టం లేని సమతా ఎమ్.పిలు కొందరు జార్జిఫెర్నాండెజ్ నితీష్ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు!
ఏమైనా,నితీష్ నీతికి మారుపేరని చెప్పవచ్చు. నితీష్ ఇంజినీరింగ్ చదివాడు. అప్పుడే లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ మరో శిష్యుడైన లాలూతోకలిసి నితీష్ రాష్ట్రీయ జనతాదళ్ స్థాపించారు.
లాలూ అవినీతి సహించలేక, ఫెర్నాండెజ్‌తో కలిసి, సమతాపార్టీ స్థాపించారు.
ఇలా నీతి కోసం నితీష్ పార్టీలను మార్చారు. మంచిదే. నితీష్‌కుమార్ వయస్సు 77 సంవత్సరాలు.
- డాక్టర్ తుర్లపాటి కుటుంబ రావు, (‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత)
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/