ఢిల్లీ పర్యటన లో బిహార్ సీఎం నితీశ్ కుమార్ బిజీ బిజీ

ఢిల్లీ పర్యటన లో బిజీ గా ఉన్న బిహార్ సీఎం నితీశ్ కుమార్ యాదవ్..సీపీఎం నేత సీతారాం ఏచూరిని క‌లిశారు. రాబోయే ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని అభ్య‌ర్థిగా పోటీ చేస్తారా అని అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న బ‌దులిస్తూ.. ఆ పోస్టును నేను కోరుకోవ‌డం లేద‌ని, నాకు ప్ర‌ధాని కావాల‌న్న ఆశ లేద‌ని నితీశ్ అన్నారు. సీపీఎం తాము క‌లిసే ఉన్నామ‌ని, అందుకే ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న చెప్పారు. విభిన్న పార్టీలు ఒకే ద‌గ్గ‌ర‌కు వ‌స్తే అది పెద్ద విష‌యం అవుతుంద‌ని ఆయ‌న అన్నారు. ఆ తర్వాత సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను నితీష్ కలిశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, జేడీయూ నేత సంజయ్ ఝా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

నిన్న నితీశ్ కుమార్ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవి, వారి కుమారుడు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా పాల్గొని చర్చించారు. ఢిల్లీలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని కలుస్తానని నితీశ్ కుమార్ అన్నారు.

అలాగే, నిన్న సాయంత్రం రాహుల్ గాంధీని కలిసి చర్చించారు. తన రెండో పర్యటనలో కూడా నితీశ్ కుమార్ 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తున్నారు. కాగా, దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బీజేపీ 50 సీట్లకే పరిమితం అవుతుందని నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు.