గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్య.. ఐదుగురు యూపీ పోలీసులు సస్పెండ్

Gangster Atiq Ahmed’s Killing: 5 UP Policemen Suspended

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పోలీస్‌ కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్ హత్యపై ఐదుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. షాగంజ్ పోలీస్ స్టేషన్‌ హౌస్ ఆఫీసర్ అశ్వనీ కుమార్ సింగ్‌తోపాటు ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు కానిస్టేబుల్స్‌ సస్పెండయ్యారు. అతిక్‌ అహ్మద్‌, అతడి సోదరుడి హత్యపై దర్యాప్తు కోసం యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఈ పోలీస్‌ అధికారులను ప్రశ్నించనున్నది. క్రైమ్ సీన్‌ను మళ్లీ సృష్టించేందుకు సిట్‌ మంగళవారం ప్రయత్నించింది. శనివారం అర్ధరాత్రి వేళ అతిత్ అహ్మద్‌‌, అతడి సోదరుడ్ని ఆసుపత్రికి తరలించినప్పుడు ఎంత మంది పోలీసులు భద్రతగా ఉన్నారు? వారి హత్య తర్వాత శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి పోలీసులకు ఎంత సమయం పట్టింది అన్నది సిట్‌ అధికారులు ఆరా తీశారు.

కాగా, ఈ నెల 15న యూపీ మాజీ ఎంపీ అతిక్‌ అహ్మద్‌ , ఆయన సోదరుడిపై ముగ్గురు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపి హత్య చేశారు. అతిక్‌ అహ్మద్‌ ప్రయాగ్‌రాజ్‌లో మీడియాతో మాట్లాడుతున్న సమయంలో జర్నలిస్టులుగా వచ్చిన ఆ ముగ్గురు లైవ్‌లోనే కాల్పులు జరిపి చంపారు. ముగ్గురు నిందితులను లవ్లేష్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్యగా గుర్తించారు. హంతకులను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి ప్రయాగ్‌రాజ్ కోర్టు అప్పగించింది. ఏప్రిల్ 23న ఆ ముగ్గురిని మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.