నీతి ఆయోగ్‌కు రాజీవ్‌ కుమార్‌ రాజీనామా

రాజీవ్ కుమార్ రాజీనామాకు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పదవికి రాజీవ్ కుమార్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఆయన ఉన్నట్టుండి నిన్న ప్రభుత్వానికి రాజీనామా సమర్పించారు. దీంతో ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 30న రాజీవ్ పదవీకాలం ముగుస్తుందని తెలిపింది. రాజీవ్ కుమార్ స్థానంలో కొత్తగా సుమన్ కె. బెరీని వైస్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 1న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

ప్రముఖ ఆర్థికవేత్త అయిన రాజీవ్ కుమార్.. 2017 ఆగస్టులో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా ఎంపికయ్యారు. వ్యవసాయం, ఆస్తుల సమీకరణ, డిజిన్వెస్ట్ మెంట్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్, విద్యుత్ వాహనాలు వంటి వాటి విషయాల్లో విధాన నిర్ణయాలకు సంబంధించి కీలక పాత్ర పోషించారు.

మరోవైపు కొత్త వైస్ చైర్మన్ సుమన్ కె. బెరీ.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ (ఎన్ సీఏఈఆర్) డైరెక్టర్ జనరల్ (చీఫ్ ఎగ్జిక్యూటివ్)గా పనిచేశారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి, గణాంక కమిషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాంకేతిక సలహా కమిటీ ఆన్ మానిటరీ పాలసీల్లో సభ్యుడిగానూ ఉన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/