కేసీఆర్ ఆరోపణలు నిరాధారం – నీతి ఆయోగ్‌

తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల ఫై నీతి ఆయోగ్ స్పందించింది. బలమైన రాష్ట్రాలతో పటిష్టమైన దేశాన్ని తయారు చేయగలమన్న ఉద్దేశ్యంతో సహకార సమాఖ్య స్ఫూర్తితో నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు నీతి ఆయోగ్ అనేక చర్యలు తీసుకుందని స్పష్టం చేసింది. గత ఏడాది నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్/ సభ్యులు వివిధ రాష్ట్రాల సీఎంలతో 30కి పైగా సమావేశాలు నిర్వహించి, రాష్ట్రాలకు సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం చూపిందని చెప్పింది. తమ అభ్యర్థనలు పెడచెవిన పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నీతి ఆయోగ్‌తో సమావేశం నిర్వహించలేదని తెలిపింది. ఆదివారం జ‌ర‌గనున్న నీతి ఆయోగ్ భేటీకి హాజ‌రుకాకూడ‌ద‌ని కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది. రాష్ట్రాల‌కు కేంద్రం అన్నిర‌కాలుగా ఆర్థిక స‌హ‌కారం అందిస్తోందని కూడా వెల్ల‌డించింది.

కేంద్ర ప్ర‌భుత్వ ప్రాయోజిత ప‌థ‌కాల కేటాయింపులు 2015-16లో రూ.2,03,740 కోట్లు ఉండ‌గా.. 2022-23 ఏడాదికి రూ.4,42,781 కోట్లకు పెరిగిన‌ట్టు తెలిపింది. జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కింద తెలంగాణ‌కు రూ.3,982 కోట్లు కేటాయిస్తే… తెలంగాణ కేవ‌లం రూ.200 కోట్లు మాత్రమే తీసుకుందని తెలిపింది. పీఎంకేఎస్‌వై- ఏబీపీ స్కీం కింద రూ.1,195 కోట్లు విడుద‌ల చేశామ‌ని నీతి ఆయోగ్ వెల్ల‌డించింది. ఆగస్టు 7న జరగనున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనకూడదని నిర్ణయించుకొని, నిరాధార ఆరోపణలతో సమస్యలను రాజకీయం చేసేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమని తెలిపింది. గవర్నింగ్ కౌన్సిల్ అనేది టీమ్ ఇండియా అత్యున్నత స్థాయిలో చర్చించి, దేశాభివృద్ధికి సత్ఫలితాలిచ్చే పరిష్కారాలను సూచించే వేదిక అన్నారు.