నిక్కీ యాదవ్ హత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు..!

సహజీవనం కాదు.. వారికి 2020లోనే పెళ్లి జరిగిందట..

nikki-yadav-was-married-to-her-boyfriend-since-2020

న్యూఢిల్లీః ఢిల్లీలో జరిగిన నిక్కీ యాదవ్ హత్య కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు నిక్కీ, సాహిల్ ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు భావించారు. మీడియా కూడా అలాగే రిపోర్ట్ చేసింది. అయితే, సాహిల్ ను విచారించగా వారిద్దరికీ 2020లోనే పెళ్లి జరిగిందని తేలినట్లు పోలీసులు చెప్పారు. ఈ పెళ్లి సాహిల్ ఇంట్లో వాళ్లకు ఇష్టంలేదని, సాహిల్ కు మరో యువతితో పెళ్లి నిశ్చయం చేశారని వివరించారు.

ఈ పెళ్లి చేసుకోవడానికి సాహిల్ కూడా ఒప్పుకున్నాడని చెప్పారు. మరో యువతితో సాహిల్ కు నిశ్చితార్థం కూడా జరిగిందని తెలిసి నిక్కీ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తనను పెళ్లి చేసుకుని కాపురం చేస్తూ మరో యువతితో పెళ్లికి ఎలా సిద్ధపడ్డావంటూ నిక్కీ నిలదీయడంతో ఆమెను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సాహిల్ విచారణలో చెప్పాడు.

ఈ నెల 10న పథకం ప్రకారమే నిక్కీని చంపేశానని, మృతదేహాన్ని తన దాబాలోని ఫ్రిజ్ లో దాచానని వివరించాడు. అదేరోజు తన తండ్రికి, ఇద్దరు సోదరులతో పాటు మరో ఇద్దరు స్నేహితులకు హత్య విషయం చెప్పానని వెల్లడించాడు. ఆ తర్వాతే అంతా కలిసి వివాహ వేదికకు వెళ్లామని తెలిపాడు. ఈ నెల 14న నిక్కీ యాదవ్ హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

విచారణలో సాహిల్ చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. సాహిల్ తండ్రి, ఇద్దరు సోదరులు, ఇద్దరు స్నేహితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. ఈ ఐదుగురిలో సాహిల్ సోదరుడు నవీన్ ఢిల్లీ పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ (స్పెషల్) రవీంద్ర యాదవ్ మీడియాకు వివరించారు.