బెంగళూరులో ఎన్ఐఏ అధికారుల తనిఖీలు

nia-raids

బెంగళూరుః ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ అణచివేత కోసం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు దేశవ్యాప్తంగా దాడులు కొనసాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం మహారాష్ట్ర, కర్ణాటకలోని 44 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టిన అధికారులు.. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరు లో సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి బెంగళూరులోని ఆరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

కాగా, గత శనివారం ఎన్‌ఐఏ అధికారులు మహారాష్ట్ర, కర్ణాటకలో 44 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని థానే, పుణే జిల్లాలతోపాటు కర్ణాటకలోని బెంగళూరులో శనివారం దాడులు నిర్వహించారు. ఒక థానే జిల్లాలోనే ఏకంగా 41 చోట్ల సోదాలు జరిగాయి. దాడుల్లో పెద్దఎత్తున నగదు, ఆయుధాలు, స్మార్ట్‌ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. ఐసిస్‌ మాడ్యూల్‌ నేత సాకిబ్‌ నాచన్‌తోపాటు ఐసిస్‌తో సంబంధాలు ఉన్న 15 మందిని అరెస్టు చేశారు.