న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెన్‌ సంచలన నిర్ణయం

వచ్చే నెలలో న్యూజిలాండ్‌ ప్రధాని పదవికి రాజీనామా చేస్తా..

New Zealand Prime Minister Jacinda Ardern Announces Surprise Resignation

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెన్‌ ఫిబ్రవరి 7న తన పదవికి రాజీనామా చేయాలని సంచలన నిర్ణయం తీసుకొన్నారు. గురువారం అధికార లేబర్‌ పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె రాజీనామా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన జెసిండా.. తన రాజీనామాకు ఇదే సరైన సమయమని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 22న లేబర్‌ పార్టీ తదుపరి నాయకుడి ఎన్నిక ఉంటుందని చెప్పారు. 2023 అక్టోబర్‌ 14న సాధారణ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ తప్పక గెలుస్తుందని ఆర్డెర్న్ ధీమా వ్యక్తం చేశారు.

కాగా, తాను చేయాల్సినంత చేశానని, సవాలుతో కూడిన పనిని విజయవంతంగా నిర్వర్తించానని వెల్లడించారు. ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం పూర్తి స్థాయిలో లేనప్పుడు ఇంకా కొనసాగలేమని వివరించారు. 2017 నుంచి లేబర్‌ పార్టీ అధినేతగా కొనసాగుతున్న జెసిండా అదే ఏడాది సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాని బాధ్యతలు చేపట్టారు. 2020లో జరిగిన ఎన్నికల్లో లేబర్‌ పార్టీ విజయం సాధించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ, వ్యక్తిగత ప్రజాదరణ తగ్గినట్టు తేలటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నట్లు భావిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/telangana/