ఏపీలో మరో ఓమిక్రాన్ కేసు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసులు పెరగడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఈరోజు మరో కొత్త కేసు బయటపడింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 17 కు చేరింది. ప్రకాశం జిల్లాలో కొత్తగా ఓమిక్రాన్ కేసు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి బెంగళూరు మీదుగా ప్రకాశం జిల్లాకు వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్​ నిర్దారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

విదేశాల నుంచి ఏపీకి చేరుకున్న మరో 14 మంది ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగెటివ్ వచ్చినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 17 ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లో ముగ్గురికి నెగెటివ్​గా తెలింది. ఈమేరకు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ఇక కరోనా కేసులు సైతం రాష్ట్రంలో భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 33,188 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 130 మందికి వైరస్ సోకగా..ఒకరు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ ఓమిక్రాన్ కేసులు ఎక్కువతున్నాయి.

తాజాగా తెలంగాణలో కొత్తగా 5 ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 67కు చేరుకుంది. ఇప్పటివరకు ఒమిక్రాన్​ బారిన పడిన 22 మంది బాధితులు కోలుకున్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్​ విడుదల చేసింది.