ప్రధాని మోడీ అమెరికా పర్యటన..న్యూజెర్సీ రెస్టారెంట్ లో ప్రత్యేక వంటకం

మోడీజీ తాలి..ప్రత్యేక వంటకాన్ని రూపొందించిన చెఫ్ కులకర్ణి

New Jersey restaurant launches ‘Modi Ji Thali’ ahead of PM’s US trip. This is what its dishes are

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు ముందు న్యూజెర్సీలోని ఓ రెస్టారెంట్ వినూత్న ప్రయత్నం ద్వారా ఆహ్వానం పలికింది. మోడీజీ తాలి పేరుతో ప్రత్యేక వంటకాన్ని రెస్టారెంట్ యజమాని, చెఫ్ శ్రీపాద్ కులకర్ణి రూపొందించారు. ఇందులో కిచిడి, రసగుల్లా, కశ్మీరి దమ్ అలూ, ఇడ్లి, దోక్లా, చాంచ్, పాపడ్, సార్సన్ కా సాగ్ ఉన్నాయి. స్థానికంగా నివసించే భారత సంతతి వారి డిమాండ్ మేరకు ఈ తాలిని రూపొందించినట్టు చెఫ్ కులకర్ణి తెలిపారు. 2023 మిల్లెట్స్ సంవత్సరానికి నివాళిగా, ఈ తాలిలో మిల్లెట్స్ తో చేసిన పదార్థాలు కూడా ఉన్నాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ గౌరవార్థం మరో ప్రత్యేక తాలిని రూపొందించనున్నట్టు కులకర్ణి తెలిపారు.

మోడీ తాలి గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ తాలిని ప్రారంభించబోతున్నాం, దీనికి ఎంతో ఆదరణ వస్తుందని నేను నమ్మకంగా ఉన్నాను. అనంతరం డాక్టర్ జైశంకర్ పేరుతోనూ తాలిని తీసుకురావాలనే ప్రణాళిక ఉంది. ఎందుకంటే ఆయన కూడా భారతీయ అమెరికన్ కమ్యూనిటీకి రాక్ స్టార్ గా ఉన్నారు’’ అని కులకర్ణి వివరించారు. మోడీకి సంబంధించి ప్రత్యేక వంటకం ఇదే మొదటిది కాదు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా గత ఏడాది సెప్టెంబర్ 17న ఢిల్లీకి చెందిన ఓ రెస్టారెంట్ ‘56 అంగుళాల మోడీజీ’ పేరుతో తాలిని తీసుకురావడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు జూన్ 21 నుంచి నాలుగు రోజుల పర్యటనకు ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లనున్నారు.