నూతన చట్టం వ్యవసాయరంగానికి గొడ్డలిపెట్టు!

కార్పొరేట్‌ దళారులకే ఉపయోగం

Agriculture
Agriculture

భారతదేశం వ్యవసాయక దేశం. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవ సాయం వెన్నెముక. భారతదేశ జనాభాలో 65 శాతం మంది వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.

దేశంలో చిన్న,సన్నకారు రైతులు 86 శాతం మంది ఉన్నారు. మనదేశ రైతాంగంలో నిరక్షరాస్యులే ఎక్కువ. దేశ ప్రజల ప్రధాన ఆదాయ వనరు కూడా వ్యవసాయమే.

భారతదేశవ్యాప్తంగా 1980 సంవత్సరం క్రితం వరకు గ్రామాలు, వ్యవసాయ రంగం, స్వయంసమృద్ధి సాధించి ఉండేవి. వ్యవసాయదారులు కేవలం వర్షాల మీద మాత్రమే ఆధారపడేవారు. ఇంకా దేని మీద ఆధారపడే వారు కాదు.

వారి పొలంలో దున్నడానికి వారి సొంత పశువ్ఞలు ఉండేవి. విత్తనాలు వారి భూమిలో పండించినవి. వ్యవసాయానికి స్థానికంగా దొరికిన ఆకులు, అలములు, పశువులు, గొర్రెలు, మేకల ఎరువులు ఉపయోగించేవారు. వ్యవసాయ పనిముట్లు స్థానికంగా ఉండే వృత్తి కులాల వారు చేసేవారు.

వారికి ఆరు నెలలకొకసారి రైతులు పండించిన పంటలో కొంత వారికి పెట్టేవారు.నాట్లు వేయడం, కలుపు తీయడం, కోత కోయడం, పంట కళ్లాలు చేయడం ఇంటి మనుషులు లేదా బదలు (అంటే పని ఒకరి తర్వాత ఒకరు చేసుకునేవారు) పంటలను పొలం నుండి ఇంటికి తీసు కుపోవడానికి సొంత ఎడ్లబండ్లను ఉపయోగించేవారు.

ఇలా ఖర్చు లేకుండా వ్యవసాయం చేసి స్వయంసమృద్ధి సాధించి పల్లెల్లో ప్రేమానురాగాలు వెల్లివిరిసేవి.

వ్యవసాయరంగంలోనికి హరితవిప్లవం వచ్చిన నాటి నుండి వ్యవసాయంలోకి రసాయ నిక ఎరువ్ఞలు, పురుగుల మందులు, యంత్రపరికరాలు వచ్చి వ్యవసాయరంగం అప్పుల ఊబిలోకి ప్రయాణం మొదలైంది.

దీనికి తోడు 1991 సంవత్సరం నూతన ఆర్థిక సరళీకృత విధానంతో పూర్తిగా వ్యవసాయ సంక్షోభంలోకి నెట్టబడి రైతు ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయి.

మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు భారత ప్రభుత్వం చేసిన వ్యవసాయ మార్కెట్‌ విధానం 2020 చట్టం భారత వ్యవసాయరంగానికి గొడ్డలి పెట్టు.

ఒకేదేశం, ఒకే మార్కెట్‌ స్వేచ్ఛా మార్కెట్‌ అనే నినా దం వినడానికి బాగానే ఉంది. కానీ వ్యవసాయరంగంలో 86 శాతం ఉన్న చిన్న సన్నకారు రైతులు, నిరక్షరాస్యులు కూడా తాము పండించిన పంటను రైతులు ఎక్కడైనా ఎలాంటి షరతులు, రుసుము లేకుండా అమ్ముకోవచ్చని చట్టం చేసింది.

ఇది సాధ్యంకాదు. ఎందుకంటే రైతులకు పంటలను నిల్వ చేసుకునే శక్తి లేదు. రైతులు పండించిన పంటను వారి అవసరాలకు తినడానికి తీసుకొని మిగిలిన పంటను వారి కళ్లంలో అమ్ముకోవడానికి ఇష్టపడతారు.

వారి వ్యవసాయానికి అప్పులు ఇచ్చిన చిన్న చిన్న వ్యాపారస్తులు వీరి దగ్గర నుండి కొనుగోలు చేసి వారు పట్టణాలలో అమ్ముకుంటారు.

రైతులు వారి కళ్లం నుండి పది, పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్లోకి లేదా పట్టణాల్లోకి ధాన్యాన్ని తీసుకుపోవా లంటే గోనెసంచుల ఖర్చు,ధాన్యం నింపడానికి కూలీల ఖర్చు, రవాణా ఖర్చు, మార్కెట్‌లో ధాన్యం పోయడానికి స్థలం సమస్య, ధాన్యం మంచిగా లేదని మార్కెట్‌ అధికారుల లొల్లి, ఐదు నుండి పది రోజుల సమయం, హమాలీల ఖర్చు, మార్కెట్‌ డబ్బులు కటింగ్‌, ధాన్యం డబ్బులు రావడానికి ఒక్కొక్కసారి నెలల సమయం పడుతుంది.

వ్యవసాయదారు నికి ఎప్పుడూ పని ఉంటుంది. కాబట్టి ఇంత సమయం మార్కెట్లో వృధా చేయలేడు. దీనికితోడు రైతుకు వెంబడే డబ్బులు కావాలి. కాబట్టి వీరికి స్థానిక వ్యాపారస్తులు ఎటిఎం లుగా ఉపయోగపడతారు.

కావున వారి ధాన్యాన్ని ఇతరులకు అమ్ముకుంటే ఆ వ్యాపారస్తులు దగ్గర నమ్మకాన్ని కోల్పోయి, వచ్చే పంటకు పెట్టుబడి సమస్యగా మారుతోందని రైతులు స్థానికంగా అమ్ముకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. బ్యాంకు లో రైతులకు ఏమేరకు రుణాలు ఇస్తాయో తెలుసు.

గ్రామాల్లో ఉండే వ్యాపారస్తులు ధాన్యానికి సరైన ధర ఇవ్వకపోతేఅప్పుడు రైతు స్థానికంగా ఉండే వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లి అమ్ముకుంటాడు.

ఆ మార్కెట్లో సమస్యవస్తే స్థానికంగా ఉండే రైతులు ఒక్కటై వారి సమస్యలు తీర్చుకున్న సందర్భాలు ఎన్నో చూసాం.

ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిన ఒకే దేశం ఒకేమార్కెట్‌ పద్ధతిలో దేశంలో ఎక్కడైనా రైతు తన పంట నమ్ముకునే స్వేచ్ఛ కేంద్ర ప్రభుత్వం కల్పించింది.

ఏ రైతు కూడా ఇతర ప్రాంతాలకు వాళ్ల పంటలను అమ్ముకోరు. ఈ చట్టంతో దేశ స్థాయిలో దళారీ వ్యవస్థ మొదలవుతుంది. ఇది పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ఒకవరం. ఎఫ్‌సిఐ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, కోపరేటివ్‌ సొసైటీ క్రమంగా మూతపడతాయి.రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గుతుంది. దళారుల చేతిలో ధరలు ఉంటాయి.గిట్టుబాటు ధరలు కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది.

ధరలు పెంచడానికి పోటీతత్వం ఉండదు కాబట్టి దళారులు నిర్ణయించిన ధరలకే పంటలు అమ్ముకోవా ల్సి వస్తుంది. ఈ చట్టంలో పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర గ్యారెంటీ ఇవ్వలేదు.ఇప్పటికే భారతదేశంలో వ్యవసాయం 15 శాతం కాంట్రాక్టు చేతుల్లోనే ఉంది. దేశంలో పబ్లిక్‌ రంగ సంస్థలను రైల్వేలు, టెలికమ్యూనికేషన్‌, బ్యాంకులు మొదలైన వాటిని ప్రైవేట్‌పరం చేశాయి.ఈ చట్టంతో కార్పొరేట్‌ సంస్థలు రాజ్యమేలుతాయి.

పై రంగాలలో ప్రభుత్వం పెట్టుబడి ఉం టుంది.కానీ వ్యవసాయరంగంలో ప్రభుత్వ పెట్టుబడి ఉండదు. అందులో రైతులే పెట్టుబడి పెట్టుకుంటారు.

కాబట్టి వ్యవసా యంలో కార్పొరేట్‌ సంస్థలకు కాంట్రాక్ట్‌ ఇస్తే భారతదేశ వ్యవ సాయదారులు అంతా వారి పొలాలలోవారే కూలీలుగా మారు తారు. ఈ చట్టం మూలంగా భవిష్యత్తులో భారతదేశ జనాభా ఆహార సమస్య ఏర్పడుతుంది.

ఈ కార్పొరేట్‌ సంస్థలు దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి ఇతర దేశాలలో ఏది ఎక్కువ రేటు వస్తుందో ఆ పంటలను పండించి ఎగుమతి చేస్తారు. వ్

యవసాయ పొలాలు కాంట్రాక్టు తీసుకున్నవారు పొలానికి గట్టు లేకుండా వందల వేల ఎకరాలు చదును చేస్తారు.

దీంతో వారి పొలం ఎక్కడ ఉందో తెలియకుండాపోతుంది. మనుషు లతో కాకుండా వ్యవసాయాన్ని యంత్రపరికరాలతో చేయడం మూలంగా దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది.

మొదటి రెండు,మూడు సంవత్సరాల్లో చిన్న,సన్నకారు రైతు లకు ధరలు ఎక్కువగా ఇచ్చి వారి భూములను లీజుకుతీసు కుంటారు

.వ్యవసాయంలో వరుసగా వస్తున్ననష్టాల మూలంగా రైతులు లీజుకు ఇవ్వడానికి ముందుకువస్తారు.కార్పొరేట్‌ కంపెనీలు ఏవైనా స్థానిక అవసరాల కోసం పంటలు వేయవు.

ఈ సంస్థలు పురుగులమందులు రసాయనిక ఎరువులు ఎక్కు వగా ఉపయోగించి భూసారాన్ని లేకుండాచేస్తాయి.

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను కూడా కార్పొరేట్‌ సంస్థ లకు ఇస్తాయి.

అలాగే నిత్యావసర వస్తువులైన పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ మొదలైన పంటలను అత్య వసర జాబితా నుండి ఈ చట్టంలో తొలగించడం జరిగింది.

ఈ చట్టంలో పై పంటలను స్టాక్‌ చేసి ధరలు పెరిగినప్పుడు రైతులు అమ్ముకోవచ్చని చట్టం చేసింది. ధరల నియంత్రణ ప్రభుత్వం చేతిలో ఉండదు. ఈ చట్టం పూర్తిగా కార్పొరేట్‌ దళారులకు ఉపయోగపడే విధంగా ఉంది.

  • పులిరాజు
    (రచయిత: తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)