నెహ్రూ మ్యూజియం పేరు మార్పుపై స్పందించిన రాహుల్ గాంధీ

‘Nehru ji known for his work, not just name’: Rahul Gandhi on renaming Nehru

న్యూఢిల్లీ : ఢిల్లీ నెహ్రూ మెమోరియ‌ల్ మ్యూజియం అండ్ లైబ్ర‌రీ (ఎన్ఎంఎంఎల్‌) పేరును కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌ధాన‌మంత్రి మ్యూజియం అండ్ లైబ్ర‌రీగా మార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం స్పందించారు. నెహ్రూజీ తాను చేసిన ప‌నుల‌తో ప్ర‌జ‌ల్లో గుర్తింపు పొందార‌ని కేవ‌లం ఆయ‌న పేరుతోనే కాద‌ని రాహుల్ వ్యాఖ్యానించారు. నెహ్రూ మెమోరియ‌ల్ మ్యూజియం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ మోడీ స‌ర్కార్ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు గుప్పించింది.

ప్ర‌ధాని మోడీ నెహ్రూ వార‌స‌త్వాన్ని నాశ‌నం చేయ‌డం, నిరాక‌రించ‌డమ‌నే ఏక‌సూత్ర అజెండాతో ముందుకెళుతున్నార‌ని మండిప‌డింది. నెహ్రూ వార‌స‌త్వంపై ప్ర‌భుత్వ దాడి, అణిచివేత కొన‌సాగినా జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ఘ‌న వార‌స‌త్వం ఉనికిలో ఉంటుంద‌ని, రాబోయే త‌రాల‌కు నెహ్రూ స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తార‌ని స్ప‌ష్టం చేసింది.

మ‌న తొలి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ విష‌యంలో మోడీకి ఎన్నో భ‌యాలు, అభ‌ద్ర‌త వంటివి ఉన్నాయ‌ని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జైరాం ర‌మేష్ ట్వీట్ చేశారు. మ్యూజియం పేరు నుంచి ఎన్‌ను తొల‌గించిన ప్ర‌ధాని పీని చేర్చార‌ని అన్నారు. స్వాతంత్రోత్స‌వంలో నెహ్రూ పాత్ర‌ను మోడీ తోసిపుచ్చ‌లేర‌ని, దేశ ప్ర‌జాస్వామ్య‌, లౌకిక విలువ‌ల ప‌టిష్టం కోసం, శాస్త్ర సాంకేతిక పురోగ‌మ‌నానికి నెహ్రూ అందించిన సేవ‌లు విస్మ‌రించ‌లేర‌ని పేర్కొన్నారు. మోడీ ఆయ‌న భ‌జ‌న‌ప‌రులు నెహ్రూ సేవ‌ల‌ను త‌క్కువ చేసేందుకు చౌక‌బారు ప్ర‌చారం సాగిస్తున్నార‌ని మండిప‌డ్డారు.