నిత్యావసరాలు కొనాలంటే భయపడుతున్న సామాన్యులు..

ఏమి కొనేటట్లు లేదు.. ఏమి తినేటట్లు లేదు.. అంటూ సామాన్యులు మాట్లాడుకుంటున్నారు. కరోనా తర్వాత అందరి జీవితాలు అతలాకుతలం అయ్యాయి. ఇప్పుడిప్పుడే కాస్త బాగుంటుంది అనుకునేలోపే..నిత్యావసర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీంతో సామాన్యులు మార్కెట్ కు వెళ్లాలంటే భయపడుతున్నారు.

కూరగాయలంటే ముందుగా గుర్తొచ్చే టమాటా.. నెల క్రితం వరకు రూ.20 లకు కేజీ వచ్చేది .ఇప్పుడు ఏకంగా కేజీ 120 రూపాయలకు చేరింది. అలాగే పచ్చి మిర్చి అంతకు మించిపోయింది. పచ్చి మిరపకాయలు లేని కూరను ఊహించలేము. ఏ రకమైన కూరలోనైనా పచ్చి మిరపకాయల వేస్తే ఆ కూర రుచి అద్భుతంగా ఉంటుంది. చాలా మంది పచ్చి మిరపకాయలను ఆహారంతో పాటు విడిగా తినడానికి ఇష్టపడతారు. అయితే ఇప్పుడు మిరపకాయలను కొనాలంటే కరెంట్ షాక్ కొడుతున్నట్లు ఫీల్ అవుతున్నారు. కేజీ మిర్చి రూ. 140 పలుకుతుంది. ఈ ధర చూసి మిర్చి తినకున్న ఘాటు ఇస్తుందని అంటున్నారు.

కందిపప్పు కిలో కొనాలంటే 150కి పైమాటే. ఒక్క కందిపప్పు మాత్రమే కాదు మిగతా పప్పులు కూడా అలాగే ఉన్నాయి. బియ్యం ధరలు బరువెక్కుతున్నాయి. నిత్యావసరాల ధరలు నానాటికీ పెరుగుతుండటంతో.. పేద, మధ్యతరగతి వర్గాల వంటింటి బడ్జెట్‌ రాకెట్‌లా దూసుకెళ్తోంది. నాలుగేళ్ల కిందటితో పోలిస్తే పప్పుల ధరలు 30 నుంచి 70 శాతం వరకు పెరిగాయి. నాణ్యమైన సన్న బియ్యం రేటు ఏడాదిలోనే 20 శాతం ఎగబాకింది. కరోనా, ఉక్రెయిన్‌- రష్యా యుద్ధ నేపథ్యంలో మండిన నూనెల ధరలు తర్వాత కాస్త దిగొచ్చినా.. ఇంకా సలసల మరుగుతూనే ఉన్నాయి. కూరగాయల ధరలు 100 శాతం నుంచి 200శాతం వరకు పెరిగాయి. మొత్తంగా చూస్తే సామాన్యుడు బ్రతికే రోజులు పోయాయి. వచ్చే తక్కువ జీతాలతో ఇంటిని పోషించడం..పిల్లల స్కూల్ పీజులు కట్టడం..ఇవన్నీ తలకుమించిన భారంగా ఫీల్ అవుతున్నారు.