రియా చక్రవర్తి అరెస్ట్

సుశాంత్ మరణంలో డ్రగ్స్ కోణం..ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా

NCB arrests Rhea Chakraborty

ముంబయి: బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) మంగళవారం అరెస్ట్ చేసింది. రియాను ఎన్సీబీ అధికారులు గత కొన్నిరోజులుగా విచారిస్తున్నారు. ఈ విచారణలో తాను సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు రియా అంగీకరించింది. ఆమె నుంచి ఇప్పటికే కీలక సమాచారం రాబట్టిన ఎన్సీబీ… మరింత సమాచారం తెలుసుకునేందుకు ఆమెను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దర్యాప్తులో ఎన్సీబీ వేగం పెంచడం చూస్తుంటే సుశాంత్ మరణంలో డ్రగ్స్ వ్యవహారమే కేంద్రబిందువుగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి.

కాగా, రియా చక్రవర్తి ప్రస్తుతం ముంబయిలోని ఎన్సీబీ కార్యాలయంలో ఉంది. ఆమెను ఇవాళ రెండు దఫాలుగా విచారించిన ఎన్సీబీ అధికారులు మరోసారి విచారించేందుకు సిద్ధమవుతున్నారు. రియాను ఇవాళ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశాలు కనిపించడంలేదు. రియాకు తొలుత వైద్య పరీక్షలు నిర్వహించాలని నార్కొటిక్స్ అధికారులు భావిస్తున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/