హింజిలిలో న‌వీన్ ప‌ట్నాయ‌క్‌ నామినేష‌న్

Naveen Patnaik nomination in Hinjili

న్యూఢిల్లీః ఒడిషా సీఎం, బీజేడీ చీఫ్ న‌వీన్ ప‌ట్నాయ‌క్ గంజాం జిల్లాలోని హింజిలి అసెంబ్లీ స్దానం నుంచి మంగ‌ళ‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న వెంట ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు ఉన్నారు. కంత‌బంజి, హింజిలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు.

లోక్‌సభ ఎన్నిక‌ల‌తో పాటు మే 13 నుంచి జూన్ 1 వ‌ర‌కూ ఒడిషా అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక ఒడిషాలో ప్ర‌ధానంగా బీజేపీ, బీజేడీ మ‌ధ్య పోటీ నెల‌కొనగా కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ కొంత‌మేర ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.

ఇక, బీజేపీ, బీజేడీ కుమ్మ‌క్క‌య్యాయ‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవ‌ల ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీల్లో ఆరోపించారు. ఈ రెండు పార్టీలు వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యాయ‌ని పైకి మాత్రం ఒక‌రిపై ఒక‌రు పోటీ చేస్తున్న‌ట్టు న‌టిస్తాయ‌ని ఎద్దేవా చేశారు. మోదీ, న‌వీన్ ప‌ట్నాయ‌క్‌లు కొద్ది మంది సంప‌న్నుల బాగు కోసం ప‌నిచేస్తార‌ని పేర్కొన్నారు.