వెంకయ్య నాయుడు కార్యాదక్షత అందరికీ మార్గదర్శనంః ప్రధాని మోడి

పార్లమెంట్​లో వెంకయ్యనాయుడి వీడ్కోలు కార్యక్రమం..

PM Modi’s remarks during farewell ceremony of Vice President Venkaiah Naidu in Rajya Sabha

న్యూఢిల్లీః రాజ్యసభ చైర్మన్ గా సభ నిర్వహణలో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయు తనదైన ముద్ర వేశారు.
ఈ నెల 10న వెంకయ్య పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. పార్లమెంట్​లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రసంగించిన మోడీ.. వెంకయ్యకు ధన్యవాదాలు తెలిపారు. సభకు ఇది అత్యంత భావోద్వేగపరమైన క్షణం అని పేర్కొన్నారు. వెంకయ్య నాయుడు సమక్షంలో సభలో అనేక చారిత్రక ఘటనలు జరిగాయని గుర్తు చేసుకున్నారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు కార్యాదక్షత అందరికీ మార్గదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. వెంకయ్య పదవీకాలంలో రాజ్యసభ పనితీరు గణనీయంగా మెరుగుపడిందని గుర్తు చేశారు.అయితే, దేశ ప్రజలకు వెంకయ్య నాయుడి అనుభవాల నుంచి నేర్చుకునే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు.

వెంకయ్య హయాంలో రాజ్యసభ పనితీరు మెరుగుపడిందని మోడీ గుర్తు చేశారు. రాజ్యసభ ఉత్పాదకత 70 శాతం పెరిగిందని చెప్పారు. ఎంపీల హాజరు సైతం భారీగా పెరిగిందని వెల్లడించారు. వెంకయ్యతో కలిసి పనిచేసే అదృష్టం లభించడం గొప్ప విషయమని అన్నారు. ‘మీ పని విధానం ఎంతో స్ఫూర్తిదాయకం. పనిపై పెట్టే శ్రద్ధ.. బాధ్యతగా నిర్వర్తించే తీరు ప్రతిఒక్కరికి ఆదర్శం. సభా నాయకుడిగా ఎన్నో బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించారు. కొత్తతరంతో అనుసంధానమవుతూ అత్యంత జనాదరణ ఉన్న నాయకుడిగా.. అనేక బాధ్యతలను విజయవంతంగా చేపట్టారు. మీతో భుజం కలిపి పనిచేసే అదృష్టం నాకు లభించింది. సమాజం, ప్రజాస్వామ్యం గురించి మీ నుంచి చాలా నేర్చుకోవాలి. మీ అనుభవం మీ పుస్తకంలో ప్రతిబింబిస్తుంది. మీ పుస్తకంలోని ప్రతి అక్షరం యువతకు మార్గదర్శనం. మీ పుస్తకాలు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి’ అని మోదీ కొనియాడారు.

ఈ సందర్భంగా వెంకయ్య భాషా నైపుణ్యాలపై మోడీ ప్రశంసలు కురిపించారు. వెంకయ్య విసిరే ఛలోక్తుల గురించి ప్రస్తావించారు. ‘మన ఆలోచనలు, చెప్పేవన్నీ గొప్పవే.. కానీ చెప్పే విధానమే ప్రజలను కార్యోన్ముఖులను చేస్తుంది. మీ భావ వ్యక్తీకరణ వీనులవిందుగా ఉంటుంది. మీ భాషలో సున్నితత్వం, గంభీరత కలిసి ఉంటాయి. మీ ఏకవాక్య సంబోధనలు ఎంతో ప్రేరణ కలిగిస్తాయి. అత్యంత సహజంగా ఉండే మీ భాష, భావన ప్రజలకు సూటిగా చెప్పే విధానం అనుసరణీయం. సాధారణ కార్యకర్త నుంచి ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వ్యక్తి పురోగతికి భాష, ప్రాంతం ఇవేమీ అడ్డంకులు కావు. ఎన్నో అడ్డంకులు దాటి వచ్చిన మీరు నేటి యువతకు ఆదర్శం. మాతృభాష-కంటిచూపు, పరభాష-కళ్లద్దాలన్న మీ మాట ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి’ అని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/