మోహీనీ అవతారంలో శ్రీవారు

Mohini Avataram Mesmerizes Devotees

తిరుమల: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పక్కనే పల్లకీపై కృష్ణుడి రూపంలోనూ స్వామివారు దర్శనమిచ్చారు. వేంకటేశ్వరుడి ముగ్ధ మనోహర మోహిని రూపం.. వెన్నంటే వెన్నదొంగ కృష్ణుడి రూపాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. స్వామివారి అవతారాలన్నింటిలో మోహినీ అవతారం అత్యంత ప్రధానమైంది. రంగురాళ్లు పొదిగిన ప్రత్యేకమైన ఆభరణాలు ధరించి, ఒక చేతిలో చిలుకను పట్టుకొని సింహాసనంపై హుందాగా కూర్చొని స్వామి వారు భక్తులను సమ్మోహనపరిచారు.

కాగా మంచి పనులు చేయడం ద్వారా అనుగ్రహం ఎలా పొందవచ్చో లోకానికి చాటడానికే స్వామి వారు.. జగన్మోహిని రూపం ధరించారని చెబుతారు. పరమశివుడిని కూడా సమ్మోహనపరచిన అవతారం కాబట్టే దీనికి ఇంతటి విశిష్టత. రాక్షసులను మోహంలో పడేసి.. క్షీర సాగర మధనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేయడం కోసమే స్వామివారు ఈ అవతారం ధరించారు. జగత్తంతా ఒక రకమైన మోహంతో నిండి ఉందని, దానికంతటికీ ప్రధాన కేంద్రం తన వద్దే ఉందని స్వామివారి పరమార్థం.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/