టిడిపి కార్యకర్తలంతా తమ పిల్లలే.. తల్లిని కలవడానికి పిల్లలకు అనుమతి ఎందుకు? :నారా భువనేశ్వరి

అధికారుల తీరును తప్పుబట్టిన చంద్రబాబు అర్ధాంగి

Nara Bhuvaneshwari fire on police notices

హైదరాబాద్‌ః టిడిపి కార్యకర్తలంతా తమ పిల్లలేనని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. బాధలో ఉన్న తల్లిని కలిసేందుకు వచ్చే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని, బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆమె మండిపడ్డారు. పార్టీ శ్రేణులు చేపట్టిన సంఘీభావ యాత్రలో తప్పేముందని ప్రశ్నించారు. తనను కలవడానికి వీల్లేదని చెప్పడానికి మీకేం హక్కు ఉందంటూ పోలీసు అధికారులను నిలదీశారు. తనను కలిసి మనోధైర్యం కల్పించేందుకు బయలుదేరిన వారికి పోలీసులు నోటీసులు జారీ చేస్తూ బెదిరించడాన్ని తీవ్రంగా ఖండించారు.

టిడిపి అధినేత చంద్రబాబును ప్రభుత్వం అక్రమంగా జైలులో పెట్టింది.. నిజాయతీగా పోరాడుతున్న నేతను ఇబ్బందులకు గురిచేస్తుంటే పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా నిరసన వ్యక్తం చేస్తారని భువనేశ్వరి చెప్పారు. ఈ క్రమంలో నిజాయతీ వైపు నిలబడ్డ వారికి అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తారని వివరించారు. ఇందులో భాగంగానే పార్టీ శ్రేణులు తనను కలిసేందుకు యాత్ర చేపడితే అడ్డుకోవడమేంటని, తనను కలవొద్దని చెప్పే హక్కు పోలీసులకు ఎక్కడిదని నారా భువనేశ్వరి నిలదీశారు.