నూతన పార్ల‌మెంట్ భ‌వ‌నానికి అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని కేటీఆర్ డిమాండ్

నూతనంగా నిర్మిస్తున్న పార్ల‌మెంట్ భ‌వ‌నానికి అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేసారు. దీనిపై తీర్మానం చేస్తూ ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడారు. అంబేడ్కర్‌ గొప్పదనం గురించి నిన్న సభలో కేసీఆర్‌ చెప్పారు. దేశానికి దార్శనికతను చూపి వ్యక్తి అంబేడ్కర్‌. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అంబేడ్కర్‌ చూపిన బాటలోనే మేము నడుస్తున్నాం.

సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం సాధించకుండా రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కాదు అని అంబేడ్కర్‌ అన్నారు. అంబేడ్కర్‌కు తెలంగాణ రాష్ట్రం రుణపడి ఉంటుందన్నారు. అంబేద్క‌ర్ త‌త్వాన్ని టీఆర్ఎస్ ఆచ‌ర‌ణ‌లో చూపింద‌ని మంత్రి తెలిపారు. అంబేద్క‌ర్ ల‌క్ష్యం స‌మాన‌త్వం అన్నారు. తాను రాసిన రాజ్యాంగం దుర్వినియోగం అయితే, దాన్ని తానే ముందుగా త‌గుల‌బెడుతాన‌ని అన్నార‌ని మంత్రి గుర్తు చేశారు. భార‌త ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కు ప్ర‌తీక పార్ల‌మెంట్‌, టెంపుల్ ఆఫ్ డెమాక్ర‌సీకి పేరు పెట్ట‌డానికి ఇంత‌కు మించిన వ్య‌క్తి లేరు కాబ‌ట్టి.. అందుకే అంబేద్క‌ర్ పేరును పెట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని మంత్రి కేటీఆర్ త‌న తీర్మానంలో కోరారు