ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం

munugode by-election campaign ended

మొత్తానికి మునుగోడు లో మైకులు మోగబోయాయి. గత నెల రోజులుగా మా పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలంటూ మోతమోగించిన మైకులు మూగబోయాయి. ఎల్లుండి (నవంబర్ 03) పోలింగ్ జరగబోతుంది. ఉదయం 7 గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 06 న కౌంటింగ్ జరగనుంది.

దీనికి సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులున్నారు. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు.

మునుగోడు పరిధిలో 2లక్షల 41వేల 855 మంది ఓటర్లున్నారు. ఇందులో 50 మంది సర్వీస్ ఓటర్లు, 5 వేల 685 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి.పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఇప్పటివరకు 739 మంది ధరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్కడ మూడంచెల భద్రత అరెంజ్ చేశారు. ఎన్నికల రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3 వేల 366 పోలీస్ సిబ్బందితో పాటు.. 15 కంపెనీల కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 100 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా ప్రచారంపై నిషేధం ఉంటుందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే ఓటర్ స్లిప్పులను పంపిణీ పూర్తయింది. ఆన్ లైన్ లోనూ ఓటర్ స్లిప్పులను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.

ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ జరిగే 48 గంటలకు ముందు ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. కౌంటింగ్ ముగిశాక ఈసీ కోడ్ ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. ఆ తరువాత యధావిధిగా సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు. నెల రోజులు నేతల ప్రచారంతో దద్దరిల్లిన మునుగోడులో చివరి రోజు మాత్రం ప్రచారం రణరంగాన్ని తలప్పించింది. ఈటల రాజేందర్‌ అత్త గారి ఊరు పలివెలలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో బిజెపి , టిఆర్ఎస్ కార్య కర్తలకు గాయాలు అయ్యాయి. అలాగే పలు వాహనాలు ధ్వసం అయ్యాయి. మరోవైపు స్థానికేతర నేతలంతా మునుగోడు వదిలి బయటకు వచ్చేస్తున్నారు. లోకల్‌ లీడర్లు తప్ప ఎవరూ ఉండకూడదన్న ఈసీ ఆదేశాలతో నెల రోజులు గ్రామాల్లోనే మకాం వేసిన నేతలంతా ఇంటి దారి పట్టారు.