ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు క్లీన్ స్వీప్‌

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పార్టీ విజయ డంఖా మోగించింది. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల‌ను టీఆర్ఎస్ పార్టీనే కైవ‌సం చేసుకుంది. విప‌క్షాలు క‌నీసం పోటీ ఇవ్వ‌లేక‌పోయాయి. 12 స్థానాల్లో 6 స్థానాలు ఏక‌గ్రీవం కాగా, మ‌రో 6 స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించారు. ఈ ఆరు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థులే విజయం సాధించారు.

కరీంన‌గర్‌ జిల్లాలో రెండు స్థానా‌లు తన ఖాతాలో వేసుకున్న గులాబీ పార్టీ.. ఉమ్మడి మెదక్‌, ఆది‌లా‌బాద్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానంలో జరిగిన ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.. ఈ నెల 10వ తేదీన ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగగా.. ఇవాళ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.. ఓట్లు తక్కువగా ఉండడంతో.. కేవలం రెండు గంటలలోపే విజేతలు ఎవరో తేలిపోయింది.

ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచి టీఆర్ఎస్ అభ్య‌ర్థులు భానుప్ర‌సాద్ రావు, ఎల్ ర‌మ‌ణ, ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా నుంచి వంటేరు యాద‌వ‌రెడ్డి, ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా నుంచి తాతా మ‌ధు, ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా నుంచి ఎం కోటిరెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి దండె విఠ‌ల్ గెలుపొందారు. ఏక‌గ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ అభ్య‌ర్థులు.. ఉమ్మ‌డి నిజామాబాద్‌ నుంచి కల్వకుంట్ల కవిత, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి మ్మెల్సీ స్థానాలు దక్కించుకున్నారు.