సజ్జల పరిధి దాటి ప్రవర్తిస్తున్నారన్న రఘురామ

సీఎం జగన్ కు రఘురామకృష్ణరాజు మరో లేఖ

అమరావతి : సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా మరో లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏంటో స్పష్టంగా వివరించాలని సీఎం జగన్ ను డిమాండ్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ ప్రభుత్వానికి ప్రజా సంబంధాల విషయంలో సలహాదారు అని అందరికీ తెలిసిందేనని, కానీ, ఆయన ప్రతి అంశంపైనా స్పందిస్తున్నాడని, ఈ అధికారం ఆయనకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. లేకపోతే లోగుట్టు పెరుమాళ్లకెరుక అని భావించాలా? అని పేర్కొన్నారు.

“సజ్జల రాజ్యాంగేతర శక్తిగా పరిణమిస్తున్నాడని ప్రజానీకం భావిస్తోంది. అధికారులకు సూచనలు ఇస్తూ ప్రభావితం చేయడం, మంత్రులను బెదిరించడం, ప్రభుత్వం పేరిట పార్టీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్టు బయట ప్రచారం జరుగుతోంది. తన అధికారాన్ని, హోదాను విపరీతస్థాయిలో ప్రదర్శిస్తూ తెరవెనుక హోంమంత్రిగా చెలామణీ అవుతున్నారని పార్టీ వర్గాల్లోనూ మాట వినిపిస్తోంది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి.

ప్రస్తుతం తాను ఉన్న పదవికి ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటే మాత్రం… ఓ ప్రభుత్వ సేవకుడిగా పార్టీ కార్యకలాపాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోలేరు. తాను ప్రభుత్వ సలహాదారు మాత్రమే కాదని, నాలుగు జిల్లాలకు పార్టీ ప్రధాన కార్యదర్శి-ఇన్చార్జినని చెప్పుకున్నారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఓవైపు ప్రభుత్వ జీతం తీసుకుంటూ, మరోవైపు పార్టీ కార్యకలాపాలు చక్కబెట్టుకుంటూ ఉన్నారు. ఒకవేళ మీరు ఆయన ప్రభుత్వం తరఫున మాట్లాడాలి అనుకుంటే మండలికి పంపడమో, మంత్రివర్గంలోకి తీసుకోవడమో చేయండి. అలా కాకుండా సజ్జలను ఇలాగే కొనసాగిస్తే మాత్రం ప్రజాతీర్పును అపహాస్యం చేస్తున్నట్టే లెక్క. అంటూ సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ తన లేఖలో పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/