ఒక ఎంపీని అరికాళ్లు కందిపోయేలా కొడతారా?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సూటి ప్రశ్న

TS BJP president Bandi Sanjay - MP Raghurama (Inset)
TS BJP president Bandi Sanjay – MP Raghurama (Inset)

Hyderabad: ఒక గౌరవ ఎంపీ ని లోక్ సభ స్పీకర్ అనుమతి లేకుండా అరెస్టు చేయడానికే అనుమతి ఉండదని, అలాంటిది ఒక ఎంపీని అరికాళ్లు కందిపోయేలా కొడతారా? అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఎంపీ కాళ్ల గాయాలు చూస్తుంటే ఆయన్ని ఏపీ సీఐడీ పోలీసులు చాలా దుర్మార్గంగా కొట్టారని స్పష్టం అవుతోందని అన్నారు. సామాన్య పౌరులనే కొట్టడానికి పోలీసులకు అధికారం ఉండదని , ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ఒక గౌరవ ఎంపీపై అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తారా ? అంటూ సంజయ్ మండిపడ్డారు. ఏపీలో ప్రజా స్వామ్యం ఉందా? – నియంతృత్వం కొనసాగుతోందా? అని ప్రశ్నించారు.

కొందరి మెప్పుకోసం పోలీసులు ఎంపీ పై అత్యంత క్రూరంగా వ్యవహరించినట్లు స్పష్టం అవుతోందని. అందరూ చట్టం పరిధిలోనే వ్యవహరించాల్సి ఉంటుందని , రాజకీయ నాయకులు, పాలకులు శాశ్వతం కాదని పోలీసులు గుర్తుంచుకోవాలని అన్నారు. సంఘటనపై పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

దేశంలోని ఎంపీలు, ప్రజాస్వామ్య వాదులందరూ పార్టీలకు అతీతంగా ఈ దుర్మార్గాన్ని ఖండించాలని అన్నారు. 4 నెలల కిందట హార్ట్ సర్జరీ చేసుకున్న వ్యక్తిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసే పత్రికలపై కేసులను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. మీడియాను నియంత్రించడం నియంతృత్వమే అవుతుందని అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/