సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి

mp-avinash-reddy

హైదరాబాద్ః మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నేడు ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించనున్న విషయం తెలిసిందే. కాసేపటి క్రితమే ఆయన కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున అనుచర గణంతో అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి చేరుకోగా.. పోలీసులు అనుచరులను లోపలికి అనుమతించలేదు. గేటు వద్దే వాహనాలను నిలిపివేశారు.

కాగా.. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్‌ రెడ్డిని ఈనెల 25వ తేదీదాకా అరెస్టు చేయవద్దని నిన్న తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అప్పటిదాకా ఆయన ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. అవినాశ్‌ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై 25వ తేదీన తీర్పు చెప్పనున్నట్లు ప్రకటించింది. హోరాహోరీ వాదనల అనంతరం మంగళవారం జస్టిస్‌ సురేందర్‌ ఈ మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. ‘‘25వ తేదీ వరకు ప్రతిరోజూ అవినాశ్‌రెడ్డి సీబీఐ ఎదుట హాజరుకావాలి. విచారణకు సహకరించాలి. సీబీఐ అధికారులు ప్రశ్నలను లిఖితపూర్వకంగా అందజేయాలి. అవినాశ్‌ రెడ్డి ఇచ్చే సమాధానాలను ఆడియో, వీడియో రికార్డు చేయాలి. విచారణకు సంబంధించిన రికార్డులను కోర్టుకు సమర్పించాలి’’ అని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.