నేపాల్‌ అధ్యక్షుడుకి తీవ్ర అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిక

Ailing Nepal President Ram Chandra Paudel to be airlifted to AIIMS Delhi

కఠ్మండూః నేపాల్‌ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించనున్నారు. మంగళవారం ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడంతో రామ్‌చంద్ర పౌడెల్‌కు మహారాజ్‌గంజ్‌లోని త్రిభువన్‌ యూనివర్సిటీ టీచింగ్‌ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే వైద్య పరీక్షల్లో ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్‌ సోకిందని డాక్టర్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను ఢిల్లీకి తరలించాని అధికారులు నిర్ణయించారు. దీంతో బుధవారం ఉదయం ఢిల్లీకి తీసుకురానున్నారు.

కాగా, గత నెలరోజుల్లో అధ్యక్షుడు పౌడెల్‌ అనారోగ్యానికి గురవడం ఇది రెండో సారి. శ్వాస సంబంధిత సమస్యలతో ఆయన త్రిభువన్‌ టీచింగ్‌ దవాఖానలో చికిత్స తీసుకుంటున్నారు. గత 15 రోజులుగా యాంటీబయోటిక్స్‌ తీసుకుంటున్నప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదని కఠ్మండూ పోస్ట్‌ న్యూస్‌పేపర్‌ వెల్లడించింది.

నేపాల్‌ అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్‌ ఈ ఏడాది మార్చి 10న ఎన్నికయ్యారు. అదే నెల 13న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన రామచంద్రను ప్రధాని ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్‌తో (మావోయిస్టు సెంటర్‌) పాటు ఎనిమిది పార్టీలు సంయుక్త అభ్యర్థి రామచంద్ర తన ప్రత్యర్థి.. పార్లమెంటులో రెండో అతిపెద్ద పార్టీ సీపీఎన్‌-యూఎంఎల్‌ మద్దతునిచ్చిన అభ్యర్థి సుభాష్‌ చంద్ర నెబ్‌మాంగ్‌పై విజయం సాధించారు. రామచంద్రకు 214 మంది ఎంపీలు, 352 మంది ప్రావిన్షియల్‌ అసెంబ్లీ సభ్యుల ఓట్లు వచ్చాయి.