మరోసారి రష్యా-గోవా విమానానికి బాంబు బెదిరింపు

అత్య‌వ‌స‌రంగా ఉజ్బెకిస్తాన్‌కు విమానం దారి మళ్లింపు

Moscow-Goa Flight Diverted To Uzbekistan After Bomb Threat

పనాజీః ర‌ష్యా నుంచి గోవాకు బ‌య‌లుదేరిన ఓ విమానానికి బాంబు బెదిరింపు కాల్ వ‌చ్చింది. దీంతో అజుర్ ఎయిర్ సంస్థ‌కు చెందిన విమానాన్ని అత్య‌వ‌స‌రంగా ఉజ్బెకిస్తాన్‌కు దారి మళ్లించారు. ఆ విమానంలో ఇద్దరు చిన్నారులు సహా 238 మంది ప్ర‌యాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్న‌ట్లు గోవా ఎయిర్ పోర్ట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ప‌ర్మ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం గోవాలోని డ‌బోలిమ్ విమానాశ్ర‌యంలో శనివారం తెల్ల‌వారుజామున 4.15 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ విమానంలో బాంబు ఉందంటూ అర్ధరాత్రి 12.30 గంటలకు గోవా ఎయిర్‌పోర్ట్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ మెయిల్ వ‌చ్చింది. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది అధికారులకు సమాచారమిచ్చారు. అప్పటికి విమానం భారత గగనతలంలోకి ప్ర‌వేశించ‌క‌పోవడంతో మధ్యలోనే ఉజ్బెకిస్తాన్‌కు దారి మ‌ళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

రెండు వారాల కిందట అజుర్ ఎయిర్ సంస్థకే చెందిన విమానానికి ఇలాంటి బాంబు బెదిరింపే వచ్చింది. దీంతో మాస్కో నుంచి గోవాకు వ‌స్తున్న విమానాన్ని అత్య‌వ‌స‌రంగా గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌లో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. తనిఖీలు చేయగా.. బాంబులేవీ కనిపించలేదు. ఉత్తుత్తి బెదిరింపేనని తేలడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/